న్యాయవాదులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో 2019 తర్వాత ఎన్‌రోల్ చేసుకున్న న్యాయవాదులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి కోరారు. ఆదివారం సూర్యాపేట జరిగిన ఆ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే న్యాయవాద రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రంగారావు, యూనియన్ సీనియర్ నాయకులు మొదుగు వెంకట్‌రెడ్డి, శ్రవణ్ కుమార్, మీసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆటో కార్మికులను ఆదుకోవాలి
నూతనకల్: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు చెల్లించి ఆదుకోవాలని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) జిల్లా కార్యదర్శి ఎం.రాంబాబు కోరారు. ఆదివారం నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో నిర్వహించిన ఆటో, ట్రాక్టర్, లారీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు సంఘం సభ్యత్వాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ మండల అధ్యక్షుడు పంతం వెంకన్న, బొజ్జ శ్రీనివాస్, ఇరుగు రమేష్, శివారెడ్డి, సురేష్, విజయ్‌రెడ్డి, తిరుమలేష్, జటంగి లింగయ్య, బత్తుల వెంకన్న, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్.. వరంలాంటిది
నల్లగొండ రూరల్: చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్స్ ఒక వరం లాంటిదని ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణశ్రీ, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కల్లూరి సత్తమ్మ అన్నారు. నల్లగొండలోని బాలికల ఇంటర్మీడియట్ కళాశాల, డైట్ ప్రభుత్వ పాఠశాలలను ఆదివారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసినవారు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్ చదవచ్చని తెలిపారు. అభ్యాసకులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని యువతీయువకులు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన వంటి పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు.
Comments
Please login to add a commentAdd a comment