యాప్‌ కొంప ముంచింది! | Sakshi
Sakshi News home page

యాప్‌ కొంప ముంచింది!

Published Tue, Apr 23 2024 8:30 AM

రాష్ట్ర ఎన్నికల అధికారి సత్యప్రద సాహూ  - Sakshi

ఓటింగ్‌ శాతంలో గందరగోళంపై

ఎస్‌ఈసీ వివరణ

సరిహద్దుల్లో మరింత నిఘా

సాక్షి, చైన్నె: ఓటింగ్‌ శాతం గురించి ఎప్పటికప్పుడు సమాచార సేకరణకు సిద్ధం చేసిన యాప్‌ కొంప ముంచటంతోనే తీవ్ర గందరగోళం ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రద సాహు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల రోజున యాప్‌ కారణంగా సమస్య ఏర్పడినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్‌ ద్వారా పోలింగ్‌ బూత్‌ అధికారులు ఆయా బూత్‌లలో నమోదైన ఓట్ల వివరాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉందన్నారు. తప్పని సరిగా ఇందులో నమోదు చేయాలనే ఆదేశాలు ఇవ్వక పోవడంతో అనేక మంది పూర్తి స్థాయిలో పోలింగ్‌ శాతం గురించి స్పష్టత ఇవ్వలేక పోయారని వివరించారు. ఎన్నికల అధికారులు ఓటింగ్‌ శాతం పరిశీలించి సంతకాలు చేసి తమకు తెలియజేసేలోపు జాప్యం నెలకొందన్నారు. దీంతో యాప్‌లో ఉన్న వివరాలు, సమాచారం ఆధారంగా మీడియాకు ఎప్పటికప్పుడు ఓటింగ్‌ గురించి వివరాలను తెలియజేశామన్నారు. ఈ ప్రక్రియలో జాప్యం, గందరగోళం కారణంగానే సమగ్ర వివరాలను ప్రకటించేందుకు కొంత సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

12 జిల్లాలో తనిఖీలు

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌లో సడళింపులు చేశామని పేర్కొంటూ, తమిళనాడు పొరుగున ఉన్న కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్నికలు జరుగుతుండటాన్ని పరిగణించి ఆ రాష్ట్రాల సరిహద్దులలో నిఘా ఉంచామన్నారు. ఈ రాష్ట్రాల సరిహద్దులలోని తమిళ జిల్లాలు తిరువణ్ణామలై, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, సేలం, ఈరోడ్‌, నీలగిరి, కోయంబత్తూరు, తేని, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాశి జిల్లాలో మాత్రం 57 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీల్లో నిమగ్నమైనట్లు వివరించారు. ఈ బృందాలు షిఫ్ట్‌ల వారీగా విధులలో ఉంటాయని, ఇక్కడి నుంచి ఆ రాష్ట్రాలకు నగదు, ఇతర వస్తువులు తరలించకుండా తనిఖీలు విస్తృతంగా సాతున్నాయన్నారు. సరిహద్దులు దాటే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రంలోని జిల్లాల మధ్య రూ. 50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు. పైన పేర్కొన్న జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల సరిహద్దులు దాటే వారి వద్ద రూ.50 వేలకు పైగా నగదు ఉంటే సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement