కేరళలో రైలు ఢీకొని నలుగురు దుర్మరణం
● పొట్ట కూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన సేలం కార్మికులు
సేలం: కేరళలో రైలు ఢీకొన్న ప్రమాదంలో సేలానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వివరాలు.. కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపంలో భారతపుళా చెరువు సమీపంలో సోరనూర్ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ 10 మంది కూలీలు శనివారం రైల్వే ట్రాక్ట్‌పై ఉన్న చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అటువైపుగా ఢిల్లీ – తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఇది గమనించి ఆరుగురు కూలీలు పట్టాల పై నుంచి పక్కకు తప్పించుకోగా, నలుగురు కార్మికులు రైలు కింద పడి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో మృతి చెందిన నలుగురు సేలం జిల్లా అయోధ్యపట్టినం సమీపంలోని ఆచ్చాంగుట్టపట్టి పంచాయతీ పరిధిలోని అడిమలైపుదూర్ గ్రామానికి చెందిన లక్ష్మణన్ (60), అతని భార్య వల్లి (55), ఆమె తమ్ముడు లక్ష్మణమన్ (48), అతని భార్య రాణి (45) అని తెలిసింది. ఈ విషయంగా గ్రామస్తులు మాట్లాడుతూ... వీరంతా ఏడాది క్రితం వరకు ఆచ్చాంగుపట్టిలో తోట పని చేస్తూ వచ్చారని, పని సరిగ్గా ఉండకపోవడంతో పొట్ట కూటి కోసం ఉపాధి వెతుక్కుంటూ కేరళకు వెళ్లారన్నారు. 20 రోజుల క్రితమే లక్ష్మణన్, రాణి స్వగ్రామానికి వచ్చి వెళ్లారని.. ఇంతలోనే మృతి చెందిన వార్త కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వీరికి రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment