మళ్లీ వార్తల్లోకి గిండి
సాక్షి, చైన్నె: చైన్నె గిండిలోని కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి స్మారక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగడంతో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. గిండి ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందించలేదన్న ఆగ్రహంతో డాక్టర్ బాలాజీపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. వైద్యులు సమ్మెబాట సైతం పట్టి, చివరకు ప్రభుత్వ హామీతో విరమించారు. శుక్రవారం నుంచి వైద్యులు విధుల బాట పట్టారు. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద, జిల్లా కేంద్రాల ఆస్పత్రులలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వైద్యులకు భద్రతగా తుపాకీ నీడలో సిబ్బందిని రంగంలోకి పోలీసు యంత్రాంగం దింపింది. అలాగే, శుక్రవారం నుంచి ఆస్పత్రులకు వచ్చే రోగులు, పరామర్శకు వచ్చే వారు అంటూ అందరికి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేశారు. ప్రవేశ మార్గాలలో వీరికి నాలుగు రకాల ట్యాగ్‌లతో కూడిన గుర్తింపు కార్డులను చేతికి కడుతున్నారు. అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితులలో కత్తిపోటు వివాదం చోటు చేసుకున్న గిండి ఆస్పత్రి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తీవ్ర ఉత్కంఠను రేపే పరిస్థితులు ఉదయం చోటుచేసుకున్నాయి.
వైద్యం అందక మృతి
పెరుంబాక్కంకు చెందిన విఘ్నేష్(31) కడుపునొప్పితో బుధవారం కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి స్మారక ఆస్పత్రిలో చేరాడు. అదేరోజు కత్తిపోటు వివాదం ఘటన చోటుచేసుకోవడంతో వైద్యులు విధులను బహిష్కరించారు. గురువారం కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ చికిత్సకు చేరిన విఘ్నేష్‌కు సరైన వైద్యం అందనట్టు సమాచారం. డిశ్చార్చ్ చేయాలని, తాము మరో ఆస్పత్రి చూసుకుంటామని కుటుంబసభ్యులు విన్నవించుకున్నా, అందుకు స్పందించే వాళ్లు ఆస్పత్రిలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఉదయాన్నే చికిత్స పొందుతూ విఘ్నేష్ మరణించాడు. వైద్యులు ఎవ్వరూ ఆ సమయంలో విధుల్లో లేనట్టు సమాచారం. అత్యవసర చికిత్స విభాగంలో విఘ్నేష్‌ను అడ్మిట్ చేయడం, ఆ తర్వాత అతడికి ఎలాంటి వైద్యం అందించ లేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు అందరూ అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే విఘ్నేష్ మరణించినట్టు బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి బుజ్జగించారు. ఉన్నతాధికారులు సైతం ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అదేసమయంలో గిండి ఆస్పత్రి వర్గాలు ఈ ఘటనపై ఓ ప్రకటన విడుదల చేసింది. పిత్తాశయంలో రాళ్లు ఉండడంతో విఘ్నేష్‌కు ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత చికిత్స అందించారని, చివరి క్షణంలోనే ఇక్కడకు తీసుకొచ్చారని, తాము మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకుండాపోయిందని ఈసందర్భంగా వారు పేర్కొనడం గమనార్హంకాగా, మృతిచెందిన విఘ్నేష్‌కు భార్య, చంటి బిడ్డ ఉన్నారు.
చికిత్స అందక యువకుడి మృతి
బంధువుల ఆందోళన
ఆస్పత్రులలో భద్రత కట్టుదిట్టం
రోగులకు నాలుగు రకాల ట్యాగ్‌లకు గుర్తింపు కార్డుల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment