విద్యుత్ బకాయి రూ.కోటి
సాక్షి, చైన్నె: చైన్నెలోని న్యాయమూర్తుల నివాసాలు, కోర్టులు రూ.కోటి విద్యుత్ బకాయి చెల్లించాల్సి ఉన్నట్టుగా విద్యుత్ బోర్డు నుంచి సమాచారం వెలువడింది. ఇందులో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసానికి రూ.59 వేలు చెల్లించాల్సి ఉండగా, పూందమల్లి, ఎగ్మూర్ కోర్టులకు 2020 నుంచి ఇంత వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపు జరగని కారణంగా ఆ బకాయి రూ.లక్షల్లో ఉన్నట్టు సమాచారంకోర్టులు, న్యాయ వ్యవస్థకు చెందిన క్వార్టర్స్ రూపంలో విద్యుత్ బోర్డుకు రూ.కోటి బకాయి విద్యుత్ బిల్లుల రూపంలో రావాల్సి ఉండడం గమనార్హం.
ఐఐటీల మధ్య ఒప్పందాలు
సాక్షి, చైన్నె: ఎడ్యుకేషనల్ ఇన్సియేటివ్ నిమిత్తం ఐఐటీ మద్రాసు, ఐఐటీ పాలక్కాడుల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. డేటా సైన్‌న్స్ అప్లికేషన్స్ విద్యార్థులు అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా కోర్సులు ఎంపిక చేసుకోవాడానికి, పరస్పరం నైపుణ్యాల అభివృద్ధి, మార్పిడికి ఈ ఒప్పందాలు దోహదకరం కాను న్నాయి. స్థానికంగా శుక్రవారం ఈ ఒప్పందాలు ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి, పాలక్కాడు డైరెక్టర్ శేషాద్రి శేఖర్‌ల సమక్షంలో జరిగాయి. కామకోటి మాట్లాడుతూ అర్హులైన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ చొరవ లక్ష్యాలను చేరుకోవడంలో చాలా ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ డేటాసైన్స్ ప్రోగ్రామ్‌లోని విద్యార్థులకు ఈ ఒప్పందాలు దోహదకరం అని వివరించారు. వ్యక్తిగతంగా క్రెడిట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లను స్వీకరించడానికి మరింత అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. తమ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ల అభ్యాసం, ఆవిష్కరణలకు బల మైన ప్రాధాన్యతను ఈ ఒప్పందాలు కలిగిస్తాయన్నారు. ఐఐటీ మద్రాస్‌తో సహకారం వలన విద్యార్థులు రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, నెట్‌వర్క్‌లతో బలమైన పునాది నిర్మిస్తామన్నారు.
మంత్రి సెంథిల్ బాలాజీపై ఏసీబీకి ఫిర్యాదు
● ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.400 కోట్ల నష్టంగా ఆరోపణ
సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్ బాలాజీపై అన్నాడీఎంకే తరఫున ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే సమాచార విభాగ అదనపు కార్యదర్శి నిర్మల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యా దులో డీఎంకే పాలనలో 2021 ఏడాది నుంచి 2023 వరకు విద్యుత్ బోర్డుకు ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేయడంలో రూ.400 కోట్ల నష్టం ఏర్పడినట్టు తెలిపారు. రూ.7లక్షల 87 వేలకు గుజరాత్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లను కొనుగోలు చేసిన స్థితిలో, రాష్ట్రంలో రూ.12 లక్షల 97 వేలకు 45 వేల ట్రాన్స్‌ఫార్మర్లు అధిక ధరకు కొనుగోలు జరిగాయన్నారు. ఈ వ్యవహారంలో ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడులో అధిక ధరకు కొనుగోలు చేయడం వలన ప్రభుత్వానికి రూ.400 కోట్ల నష్టం ఏర్పడిందన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన డీఎంకే మంత్రి సెంథిల్‌బాలాజీపై తగిన చర్యలు తీసుకోవా లని కోరారు.
ఆలస్యమవుతున్న
ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్
సాక్షి, చైన్నె: విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రూపొందించిన ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్ పథకం ఇంకా అమలు కాకపోవడంతో చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికుల పాట్లు కొనసాగుతున్నాయి. చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అందరూ సిటిజన్‌షిప్ తనిఖీ తర్వాత అనుమతిస్తున్నారు. ఇందుకోసం చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడి ఉండాల్సి వస్తోంది. అదే సమయంలో పలుమార్లు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో విమానా ప్రయాణికులు ఎదుర్కొన్న ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్–ట్రస్ట్ ట్రావెల్ ప్రోగ్రాం అనే ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా ప్రయాణికులు అత్యంత సులభంగా, త్వరతిగతిన సిటిజన్‌షిప్ తనిఖీలు పూర్తి చేసుకోవచ్చు. ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇందుకోసం చైన్నె విమానాశ్రయంలో గత ఆగస్టు నెలలో ప్రారంభించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన యంత్రాలను అమర్చడం, సిబ్బందిని ఏర్పాటు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించడం, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు వంటి పనులను పూర్తి చేశారు. అయితే ఈ కొత్త పథకం ఇప్పటి వరకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో అమలుకాలేదు. అదే సమయంలో ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలలో అమలైనట్లు తెలుస్తోంది. అయితే చైన్నె విమానాశ్రయంలో ఆలస్యం అవుతుండడం వలన ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు మాట్లాడుతూ చైన్నె విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని, అయితే ఢిల్లీలోని సెంట్రల్ ఇమ్మిగ్రేషన్ అధికారులను నుంచి అదేశాలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే చైన్నెలో అమలు చేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment