ప్రజలపై చిత్తశుద్ధి లేదా?
● డీఎంకే, అన్నాడీఎంకేలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, చైన్నె : ప్రజల మీద డీఎంకే, అన్నాడీఎంకేలకు చిత్తశుద్ధి లేనట్టుందని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్‌మురుగన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉన్నా, నిందలు మాత్రం పోలీసులకేనా అని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం అన్నాడీఎంకే కార్యాలయంపై జరిగిన దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గీయులు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వర్గీయుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనపై పన్నీరుసెల్వంకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సీబీసీఐడీ పరిధిలో ఉంది. ఈ పరిస్థితులలో సీబీసీఐడీ విచారణ ముందుకు సాగడం లేదని, కేసును సీబీఐకు అప్పగించాలని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి వేల్‌మురుగన్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదన వినిపించారు. సీబీసీఐడీ విచారణ తీరు తెన్నులను వివరించారు. ఈ కేసు విషయంగా 114 ఆధారాలు సేకరించి సైదాపేట కోర్టులో సమర్పించినట్టు వివరించారు. ఇందుకు సంబంధించిన రికార్డుల నకలు పిటిషనర్లకు అందజేశామన్నారు. ఈ కేసులో 300 మందిని నిందితులుగా పేర్కొన్నట్టు, ఇందులో వందమందికి పైగా ముందస్తు బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈసందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, ధర్మపురిలో బస్సును తగల బెట్టి విద్యార్థినులను గతంలో పొట్టన పెట్టుకున్న వారు జైలు నుంచి బయటకు రాగానే త్యాగులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రెండు పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రజల మీద చిత్తశుద్ధి లేనట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే పోలీసులు విధుల్లో ఉంటారని, అయితే, నిందలు మాత్రం పోలీసులపైనే వేస్తుంటారని అసహనం వ్యక్తం చేశారు.
హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment