కోటికి చేరువలో సభ్యులు
● విజయ్ శిబిరంలో జోష్
సాక్షి, చైన్నె: తమిళ వెట్రి కళగంలో సభ్యుల చేరిక పెరుగుతోంది. కోటికి చేరువలో సంఖ్య ఉండడంతో ఆ పార్టీ వర్గాలలో జోష్ పెరిగినట్లైంది. సినీ నటుడిగా అశేషాభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రకటనతో ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తొలుత సభ్యత్వం మందకొడిగా సాగినా క్రమంగా వేగం పుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం విజయ్ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడమే ఇందుకు కారణం. గత నెల పార్టీ ఆవిర్భావ మహానాడును ఎవరూ ఊహించని రీతిలో విజయవంతం చేశారు. పెరియార్, కామరాజర్, అంబేడ్కర్, వేలూ నాచ్చియర్, అంజలై అమ్మాల్ వంటి పంచ మూర్తుల ఆదర్శంగా రాజకీయ పయనాన్ని విస్తృతం చేశారు. మహానాడు వేదికగా విజయ్ చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శించినా, మెజారిటీ శాతం మంది ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీపరంగా కార్యక్రమాలు విస్తృతం అవుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితులలో పార్టీ సభ్యత్వ నమోదు వెబ్‌సైట్ సాంకేతిక కారణాలతో స్తంభించే పరిస్థితి నెలకొంది. దీనిని సరిచేసి మళ్లీ సభ్యత్వ నమోదు పునరుద్ధరించారు. గత నెలాఖరులో 75 లక్షలుగా ఉన్న సభ్యత్వం, శుక్రవారం నాటికి కోటి చేరువకు చేరింది. మరికొద్ది రోజులో కోటి సభ్యత్వం దాటే అవకాశాలు ఉన్నాయని తమిళగ వెట్రి కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు ఈ సభ్యత్వం పెరుగుదల పెద్ద షాక్‌గా మారింది. తమ పార్టీలో సభ్యుల చేరిక పెరుగుతుండడంతో తమిళ వెట్రి కళగం వర్గాలు మంచి జోష్ మీదున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment