విస్తరించిన పవనాలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఈశాన్య పవనాలు పూర్తిగా విస్తరించినట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరింతగా వర్షాలు అనేక జిల్లాల్లో కురవనున్నట్టు వివరించారు. 21 జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్‌లు ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల సీజన్ అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్రంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పవనాలు వచ్చిరాగానే అనేక జిల్లాల్లో భారీగానే వర్షాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ పవనాలు మ రింత ఆశాజనకంగా మారాయి. గత రెండు,మూడు రోజులుగా అనేక జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. చైన్నె, శివారులోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో అనేక చోట్ల రాత్రుల్లో మోస్తరుగా వర్షం పడుతోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు చైన్నెలోని మైలాపూర్, మందవేలి, పట్టినంబాక్కం, కోడంబాక్కం, నుంగంబాక్కం, టి.నగర్, ఎగ్మూర్, వడపళణి, కోడంబాక్కంనుంగంబాక్కం, పురసైవాక్కం పరిసరాలలో వర్షం పడింది. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో అనేక చోట్ల భారీగానే వర్షం కురిసింది. తిరుచెందూరులో భారీ వర్షం పడుతుండడంతో పౌర్ణమి రాత్రి సముద్ర తీరంలో ఎవ్వరూ బస చేయొద్దని ఆలయ పరిసరాల్లోని భక్తులను పోలీసులు పంపిచేస్తున్నారు. వర్షాలు మరింతగా కొనసాగే అవకాశం ఉండడంతో భక్తులను సముద్రం వైపు అనుమతించడం లేదు. ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో మరికొన్ని రోజులపాటు విస్తృతంగా వర్షాలు కొనసాగనున్నాయి. చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, పుదుకోట్టై, రామనాథపురం జిల్లాలకు శని, ఆదివారాలలో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రాణిపేట, కల్లకురిచ్చి, శివగంగై, అరియలూరు, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దీంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలాఉండగా, చైన్నెలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని అధికారులు పెట్టారు. చైన్నె మెట్రో వాటర్ బోర్డు పరిశీలన మేరకు చైన్నెలో 10 లక్షల 27 వేల భవనాలు ఉన్నాయి. ఇందులో 6.80 లక్షల భవ నాలలో వర్షపు నీటి సేకరణకు ఏర్పాట్లు, నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 3.50 లక్షల ఇళ్లలోనూ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
మరింతగా వానలు
21 జిల్లాలకు అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment