కేబుల్ టీవీలో పనిచేసే వ్యక్తి హత్య
సేలం: తెన్‌కాశి సమీపంలోని కుట్రాళంలో ఆదివారం వేకువజామున కేబుల్ టీవీ సిబ్బంది ఒకరిని కత్తులతో నరికి హత్య చేశారు. తెన్‌కాశి జిల్లా కుట్రాళం కాశిమేజర్‌పురానికి చెందిన మురుగన్ కుమారుడు పట్టురాజన్ (27) కేబుల్ టీవీ సంస్థలో పని చేస్తున్నాడు. వేకువజామున పోస్టర్లను అతికించే పని కూడా చేస్తున్నాడు. ఈ స్థితిలో ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో పోస్టర్లను అతికిస్తున్నాడు. అక్కడకు ఆటోలో వచ్చిన ఒక ముఠా పట్టురాజన్‌పై కత్తులతో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుట్రాళం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పట్టురాజన్ మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తెన్‌కాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వివాహ వేడుక జరుగుతున్న ఇంటి గోడకు పోస్టర్ అతికించిన సందర్భంగా వచ్చిన గొడవతో హత్యకు గురైనట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆటోలో వచ్చిన హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కారు ఢీకొని యువకుడి మృతి
● మరొకరి పరిస్థితి విషమం
తిరువళ్లూరు: వ్యక్తిగత పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తిరుగు పయనమైనవారిని కారు ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. పుదుకోట జిల్లా కుగూరు గ్రామానికి చెందిన గోపాల్ కుమారుడు శరత్‌కుమార్(27), వేలూరు జిల్లా పొయ్‌గై గ్రామానికి చెందిన కుభేరన్ కుమారుడు వెంకటేషన్(42) చైన్నెలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంలో తిరుత్తణికి వెళ్లి, పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తిరుగు పయనమయ్యారు. పట్టరైపెరంబుదూరు వద్ద వస్తున్న సమయంలో వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెనుక ఉన్న శరత్‌కుమార్, వెంకటేషన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రథమ చికిత్సను తిరువళ్లూరు వైద్యశాలలో అందించారు. మెరుగైన చికిత్స కోసం చైన్నె వైద్యశాలకు తరలించగా అక్కడే మృతి చెందారు. వెంకటేషన్ పరిస్థితి విషమంగా మారింది. మృతుడి తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
బైక్ పైనుంచి పడి
బ్యాంకు ఉద్యోగిని మృతి
సేలం: పశువు అడ్డురావడంతో బైక్‌పై నుంచి పడిన మహిళా ఉద్యోగిని మృతి చెందింది. వీరవనల్లూర్ సమీపంలో పశువు అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి కింద పడి భర్తతో వెళుతున్న బ్యాంకు ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది. నెల్‌లై టౌన్ సమీపంలోని పేట్టైపుదుగ్రామానికి చెందిన సంతానం, భార్య నివేద ప్రియదర్శిని (32) దంపతులు. సంతానం ఒక కళాశాలలో అధ్యాపకుడిగా చేస్తుండగా, ప్రియదర్శిని కల్లిడైకురిచ్చి ప్రాంతంలో ఉన్న ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ఈ స్థితిలో శనివారం భర్తతో నివేద బైక్‌పై ఉద్యోగానికి బయలుదేరింది. వారు వీరవనల్లూర్ సమీపంలో వస్తుండగా అకస్మాత్తుగా ఒక పశువు వేగంగా రావడంతో బైకు అదుపుతప్పి ప్రియదర్శిని కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికుల సహాయంతో పాలయంకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం నివేద ప్రియదర్శిని మృతి చెందింది.
తిరుత్తణిలో భక్తుడి బైక్ చోరీ
తిరుత్తణి: తిరుత్తణి కొండపై ఆలయం వద్ద భక్తుడి బైక్ చోరీ అయింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరక్కోణం సమీపంలోని పెరుమూచ్చి గ్రామానికి చెందిన నితీష్(43) ఆదివారం ఉదయం బైకులో తిరుత్తణి ఆలయానికి వచ్చాడు. కొండపై ఆలయం వద్ద బైక్‌ను పార్కింగ్ చేసి, స్వామి దర్శనానికి వెళ్లాడు. గంట తరువాత వచ్చి చూడగా బైక్ లేకపోవడంతో దిగ్భ్రాంతి చెందాడా. బైకు చోరీపై తిరుత్తణి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విధంగా అగూరు గ్రామానికి చెందిన సుందరం అనే వ్యక్తి రెండు రోజుల కిందట బైకును ఇంటి ముందు నిలిపాడు. ఉదయం లేచి చూడగా ఇంటి ముందు నిలిపిన బైకు చోరీకి గురికావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణిలో బైకుల చోరీకి అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు నిఘా పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ప్రేమ పేరుతో మోసం
అన్నానగర్: చైన్నె తిరువికనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్ట్రాగాం ద్వారా అంబత్తూరుకు చెందిన 17 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ వ్యక్తిగతంగా కలిశారు. ఈ క్రమంలో ఆ అబ్బాయి ప్రేమ మాటలు చెప్పి అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఇంతలో తన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆపరేషన్ చేయాలని విద్యార్థినితో యువకుడు చెప్పాడు. దీన్ని నమ్మిన విద్యార్థిని 5 తులాల నగలు, రూ.75 వేల వరకు చిన్నచిన్న వస్తువులు ఇచ్చింది. దీంతో ఆ యువకుడు డబ్బుల కోసం ఆమెను వేధించడంతో విద్యార్థిని షాక్‌కు గురై డబ్బులు ఇవ్వలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు డబ్బులు ఇవ్వకుంటే ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో విద్యార్థిని భయాందోళనకు గురై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ప్రేమిస్తున్నట్లు నటించి విద్యార్థిని వద్ద నుంచి నగలు, డబ్బు దోచుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment