బీజేపీలో అన్నాడీఎంకే విలీనం తథ్యం
సాక్షి, చైన్నె: డీఎంకే ఉత్తర చైన్నె నాయకుడు ఆర్‌డీ శేఖర్ నేతృత్వంలో టోల్‌గేట్ సమీపంలోని ఓ కల్యాణ వేదికలో పేదల దినోత్సవం పేరిట 48 జంటలకు సామూహిక వివాహ వేడుకను ఆదివారం నిర్వహించారు. కొత్త జంటలకు 66 రకాల వస్తువులతో సారెను అందజేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఈ వివాహాలు జరిగాయి. నవ జంటలకు తాళిబొట్లను ఉదయనిధి అందజేసి ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సభలో ఉదయనిధి మాట్లాడుతూ, పేదరిక దినోత్సవం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కొత్త జంటలలో అనేక మంది ప్రేమించి వివాహం చేసుకుని ఉన్నట్లు చెప్పారని వ్యాఖ్యలు చేశారు. ఇది స్వీయ మర్యాద వివాహం అని, ఒకర్ని మరొకరు అర్థం చేసుకుని, సర్దుకుని మంచి స్నేహితులుగా, ఉత్తమ జంటలుగా జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఇలాంటి వివాహాలు తమిళనాడులో విస్తృతం అయ్యాయని వివరించారు. ఆ దిశగా ద్రావిడ ఇయక్కం ఏర్పాట్లు చేస్తూ, సామూహిక వివాహాల నిర్వహణలో రికార్డుల దిశగా ముందుకెళ్తోందన్నారు.
వీలీనం చేసేస్తారేమో?
అన్ని పథకాలకు కలైంజ్ఞర్ పేరు పెట్టేస్తున్నట్టుగా తెగ విమర్శలు చేస్తున్నారని, 96 సంవత్సరాల వయస్సు వరకు తమిళ ప్రజల కోసం కరుణానిధి అహర్నిశలు ఆయన శ్రమించారని గుర్తు చేశారు. ఆయనపేరు పెట్టకుండా కూవత్తూరులో బొద్దింక వలే పాకుతూ వెళ్లిన వారి పేరు పెట్టాలా..? అని ప్రశ్నించారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత పేరు పెట్టినా అంగీకరించని పరిస్థితులలో ప్రస్తుతం పళణి స్వామి ఉన్నారని మండి పడ్డారు. ఇందుకు కారణం ప్రస్తుతం ఆయన మది నిండా మోదీ, అమిత్‌షా మాత్రమే ఉండటమేనని వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల క్రితం బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసిన పళణి స్వామి, ఇప్పుడు కొత్త పలుకు అందుకుని ఉన్నారని విమర్శించారు. సేలంలో ఐటీ దాడి జరగగానే, కూటమి గురించి ఎన్నికల సమయంలో మాట్లాడుకుందామని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి దాడులు మరో రెండు మూడు జరిగితే చాలు తక్షణం బీజేపీలోకి అన్నాడీఎంకేను విలీనం చేసేస్తారని, ఆదిశగానే ఆయన చర్యలు, అన్నాడీఎంకే పరిస్థితి ఉందని జోస్యం చెప్పారు. ఎంపీ ఎన్నికలలో 40కు 40 స్థానాలతో రికార్డును సృష్టించే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేస్తూ, 2026 ఎన్నికలలోప్రజా మద్దతుతో 200 స్థానాలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా శ్రమిద్దామని కేడర్‌కు పిలుపు నిచ్చారు.
విస్మయం..
ఈ వివాహ వేడుకలో ఉదయనిధి స్టాలిన్ తన చేతుల మీదుగా తాళి బొట్టు అందజేస్తూ వచ్చారు. ఈ సమయంలో ఓ వరుడికి అందజేయాలని తాళిబొట్టును అతడి తల్లికి అందజేశారు. అయితే ఆమె హడావుడిలో తన కుమారుడి చేతికి తాళి బొట్టు ఇవ్వకుండా వధువుకు ఆమె కట్టే ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న వారందర్నీ విస్మయంలో పడేసింది. తక్షణం ఉదయ నిధి ఆమెను వారిస్తూ వరుడికి అందజేయాలని సూచించడం గమనార్హం. ఈ ఘటన కాసేపు అక్కడున్న వారందర్నీ నవ్వుకునేలా చేసింది. ఈ వేడుకకు మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు తదితరులు హాజరయ్యారు.
సంస్కృతి, భాషాభ్యున్నతే లక్ష్యం..
తమిళనాడులో ద్రావిడ ఇయక్కం కొత్త విప్లవం దిశగా ముందుకు వెళ్తోందని, ఇలాంటి సంస్కృతి విస్తృతం కావాలని ఆకాంక్షించారు. అయితే ఆర్యులు, వారి మద్దతుదారులు, బానిసల గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సి ఉందని గుర్తు చేస్తూ, ఇలాంటివి చూస్తే కడుపు మంటతో వారిలో కోపం పెరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు తగలాల్సిన వారికి తగులుతాయని పేర్కొన్నారు. వారి కడుపు మంట, కోపం గురించి అవసరం లేదని, తమిళనాడు సంస్కృతి, తమిళ భాషాభ్యున్నతి , పరిరక్షణ లక్ష్యంగా తమిళుల జీవితాలు ఉజ్వలమయం కావడమే కాకుండా ప్రపంచ దేశాలలో వర్థిల్లే విధంగా ద్రావిడ ఇయక్కం సీఎం విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం స్టాలిన్ అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులు చూసిన ప్రజలు ఆయన వెళ్లిన చోటంతా బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. 1.16 కోట్ల మంది మహిళలకు ప్రతినెలా బ్యాంక్ ఖాతాలలో రూ.1000 జమ చేయడం వంటి పథకాలకు ఆకర్షితులైన వాళ్లు సీఎంకు జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూసి ఓర్వ లేక అన్నాడీఎంకే నేత పళణి స్వామిలో కడుపు మంట రెట్టింపు అయి ఉందని విమర్శించారు. ప్రభుత్వ పథకాలకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఏదో ఒక రకంగా నిందలు వేయడం, బురద చల్లడం లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారని ధ్వజమెత్తారు.
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు పళణి స్వామి ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారంటూ విమర్శలు తమిళ సంప్రదాయల పరిరక్షణే ధ్యేయంగా పాలన 48 జంటలకు వివాహం, సారె సమర్పణ
‘‘వరుసగా ఐటీ, ఈడీ దాడులు జరిగితే చాలు.. బీజేపీలో అన్నాడీఎంకేను వీలినం చేసేస్తారు, ఆ దిశగానే ఆ పార్టీ నేత పళణి స్వామి చర్యలు ఉన్నాయి..’’ అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళ సంస్కృతి, భాషాభ్యున్నతే లక్ష్యంగా ద్రావిడ మోడల్ పాలన జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment