యువకుడి అవయవదానం
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని ముల్లిపాల్యంలోని వీరాస్వామి వీధికి చెందిన ఆనందన్ కుమారుడు అవినేష్(30). ఇతను బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. అవనేష్ ఈనెల 14న వానియంబాడికి బైకులో వెళ్లాడు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతని తల్లిదండ్రులు చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అవినేష్‌కు శనివారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని అవయవాలను దానం చేసేందుకు అత ని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. దీంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో అవయవాలను దానంగా అందజేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అవయవాలు దానం చేయడంతో ప్రభుత్వం తరపున సబ్ కలెక్టర్ బాల సుబ్రమణియన్ అవినేష్ మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
చైన్నెకి
ఫైనాన్స్ కమిటీ సభ్యులు
● నాలుగు రోజుల పర్యటన
సాక్షి,చైన్నె : భారత ఫైనాన్స్ కమిషన్ బృందం ఆదివారం రాత్రి చైన్నెకు చేరుకుంది. నాలుగు రోజుల పాటు తమిళనాడులో ఈ బృందం పర్యటించనుంది. భారత దేశ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని ఈ బృందంలో సభ్యులు అజయ్ నారాయణ్, జార్జ్ మాథ్యు, మనోజ్ పాండ,సౌమ్య తదితరులు ఉన్నారు. చైన్నెకు వచ్చిన ఈ బృందం ఓ హోటల్‌లో బస చేసింది. సోమవారం తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్థిక మంత్రితో పాటు అధికారులతో ఈ బృందం సమావేశం కానుంది.
విల్లుపురంలో
క్షేత్రస్థాయి పర్యటన
సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ ఈనెల 28,29 తేదీలలో విల్లుపురం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం ఈ సమాచారాన్ని విల్లుపురం డీఎంకే వర్గాలకు లేఖ రూపంలో స్టాలిన్ తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు,ప్రాజెక్టుల సమీక్షతో పాటుగా పార్టీ బలోపేతం దిశగా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ క్షేత్ర స్థాయి పర్యటనలో నిమగ్నమైన విషయం తెలిసిందే. తదుపరి పర్యటనగా విల్లుపురం జిల్లాలో ఈనెల 28,29 తేదీలలో పర్యటించనున్నారు.
సంగీత మాంత్రికుడికి
ఎక్స్‌టీఐసీ అవార్డు ప్రదానం
సాక్షి, చైన్నె: సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఐఐటీ మద్రాసు వర్చువల్ రియాలిటీ సెంటర్ ఎక్స్‌టీఐసీ అవార్డు – 2024ను ఆదివారం చైన్నెలో ప్రదానం చేశారు. వీఆర్ ఫిల్మ్ లీ మాస్క్ లఘు చిత్రానికి దర్శకత్వం నిర్మాత తదితర బాద్యతలు వహించినందుకు గాను ఈ అవార్డుతో ఐఐటీ మద్రాసు ఏ ఆర్ రెహ్మాన్‌ను సత్కరించింది. భారతదేశంలో అకాడమీ – ఇండస్ట్రీ సపోర్టెడ్ శ్రీఎక్స్‌టెండెడ్ రియాలిటీ( ఎక్స్ ఆర్) సమ్మిట్‌లో తొలిసారిగా ఈ అవార్డును అందజేశారు. ఓకులస్ వర్సిటీ ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, అమెరికా కంప్యూటర్ శాస్త్రవేత్త స్టీవెన్ లావల్లే, ప్రొఫెసర్ అన్నా లావల్లేలు ఏఆర్ రెహ్మాన్‌కు ఈ అవార్డును అందజేశారు. 2022లో రూపుదిద్దుకున్న లీమస్క్ డాక్యుమెంటరీ చిత్రంలో ఏఆర్ రెహ్మాన్ కృషిని ఈసందర్భంగా వివరిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి. కామకోటి, ఐఐటీ మద్రాసు బయో మెడికల్ ఇంజినీరింగ్, అప్‌లైడ్ మెకానిక్స్ విభాగం ప్రొఫెసర్, ఎక్స్‌టీఐసీ హెడ్ ఎం. మణివణ్ణన్ తదితరులు పాల్గొన్నారు.
లాటరీ కింగ్ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
సాక్షి, చైన్నె: లాటరీ కింగ్ మార్డిన్‌ను టార్గెట్ చేసి రంగంలోకి దిగిన ఎన్‌ఫౌర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాల సోదాలు ఆదివారం ముగిశాయి. నాలుగు రోజుల పాటు చైన్నె, కోయంబత్తూరులలో ఈ సోదాలు జరిగాయి. చైన్నెలోని మార్టిన్ అల్లుడు, వీసీకే నేత అదవ అర్జునన్ ఇళ్లు, కార్యాలయాలలోనూ సోదాలు జరిగాయి. కోయంబత్తూరు తుడియలూరుకు చెందిన లాటరీ వ్యాపారి మార్టిన్‌ను కింగ్ ఆఫ్ లాటరీ అని అందరూ పిలుస్తున్న విషయం తెలిసిందే. సిక్కిం లాటరీ టిక్కెట్ల అమ్మకాల్లో నియమాలను అతిక్రమించి కేరళలో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయనపై వచ్చిన ఆరోపణలతో గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తదుపరి ఈడీ రంగంలోకి దిగింది. ఈ నాలుగు రోజుల సోదాలలో సుమారు 10 కోట్ల నగదుతో పాటు కీలక రికార్డులు బయటపడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment