తిరువళ్లూరు: అరక్కోణం నుంచి చైన్నె వైపు బయల్దేరిన రైలు రెండు రైల్వే స్టేషన్లలో ఆగకుండా రావడంతో తిరువేలాంగాడు వద్ద దిగిన ప్రయాణికులు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అరక్కోణం నుంచి చైన్నె వైపు లోకల్ రైలు శుక్రవారం ఉదయం 6.40 గంటలకు బయల్దేరింది. రైలులో విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. ఈ రైలు అరక్కోణం నుంచి బయల్దేరి అన్ని రైల్వేస్టేషన్లలో ఆగి వెళ్లాల్సి ఉంది. అయితే పులియమంగళం, మోసూరు తదితర స్టేషన్‌లలో ఆగకుండా వేగంగా పరుగులు తీసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురై కేకలు వేయడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోగా తిరువేళాంగాడులో రైలు ఆగింది. దీంతో పులియమంగళం, మోసూరులో దిగాల్సిన ప్రయాణికులు తిరువేళాంగాడులో దిగి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. పులియమంగళం, మోసూరులో ట్రైన్ ఎందుకు ఆగలేదో చెప్పాలంటూ నిలదీశారు. ఇందుకు డ్రైవర్ సమాధానమిస్తూ తాను కొత్త అని, తప్పు జరిగిందని ప్రయాణికులకు నచ్చజెప్పారు. దీంతో పది నిమిషాలు ట్రైన్ ఆలస్యంగా రాకపోకలు సాగించింది. తిరువేళాంగాడులో దిగిన ప్రయాణికులు పులియంమంగళం, మోసూరుకు మరో ట్రైన్‌లో బయల్దేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment