అన్నానగర్: తిరుక్కళికుండ్రం సమీపంలో తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్న దంత వైద్య విద్యార్థి శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తిరునెల్వేలి జిల్లా కల్లికులం ప్రాంతానికి చెందిన సహయ రోజాస్ నివిన్(23) తిరుక్కళికుండ్రం పక్కనే ఉన్న తండరై గ్రామంలోని ఓ ప్రైవేట్ డెంటల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్‌లో ఉండేవాడు. గురువారం ఉదయం ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి సాయంత్రం హాస్టల్‌కు వచ్చాడు. అనంతరం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అందరూ హ్యాపీగా ఆడుకుని హాస్టల్‌కి తిరిగొచ్చారు. తర్వాత అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు. రోజాస్ నివిన్ శుక్రవారం వేకువజామున ఒక్కసారిగా బెడ్ పైనుంచి లేచి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటికి గాఢనిద్రలో ఉన్న తోటి విద్యార్థికి మెలకువ వచ్చింది. రోజాస్ నివిన్ ఉరివేసుకుని ఉండడం చూసి కేకలు వేశాడు. మిగతా విద్యార్థులు కూడా షాక్‌తో లేచారు. వెంటనే సహయ రోజాస్ నివిన్‌ను రక్షించి చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న తిరుక్కళికుండ్రం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి సహయ రోజాస్ నివిన్ తన స్నేహితులతో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
సేలం: జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితో ఓ ఉపాధ్యాయుడు తన కాళ్లు పట్టించుకున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యి కలకలం రేపింది. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో ఉన్న తలైవాసల్ తాలూకా పరిధిలోని కిలక్కు రాజపాళయం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. ఇందులో అదే ప్రాంతానికి చెందిన, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 90 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలలో పని చేస్తున్న కామక్కపాలయం గ్రామానికి చెందిన గణితం ఉపాధ్యాయుడు జయప్రకాష్ మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా తరగతి గదిలోనే నిద్రిస్తున్నట్టు పలు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ స్థితిలో ఉపాధ్యాయుడు జయప్రకాష్ కుర్చీలో కూర్చుని ఓ విద్యార్థితోకాళ్లు పట్టించుకున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. దీంతో సేలం జిల్లా విద్యాధికారి కబీర్, గణితం ఉపాధ్యాయుడు జయప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment