క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Sat, Nov 23 2024 12:18 AM | Last Updated on Sat, Nov 23 2024 12:18 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

చెంగల్పట్టుకు ప్రత్యేక బస్సులు

కొరుక్కుపేట: ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు చెంగల్పట్టుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రవాణా శాఖ వెల్లడించింది. నిర్వహ ణ పనుల కారణంగా చైన్నె బీచ్‌–చెంగల్పట్టు మార్గంలో 28 ఎలక్ట్రిక్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. రైళ్ల రద్దు ప్రభావం చూపకుండా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో రీషెడ్యూల్‌ చేసి నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్‌ రవాణా సంస్థ అదనపు ప్రత్యేక బస్సులను నడుపతుందని తాంబరం – చెంగల్పట్టు మధ్య ప్రత్యేక బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే కిలాంబాక్కం బస్‌స్టేషన్‌న్‌కు సాధారణ బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులు డిమాండ్‌ను తెలుసుకుని బస్సులను పెంచుతామని అధికారులు తెలిపారు.

లిఫ్ట్‌ వాహనం కిందపడి

కార్మికుడి మృతి

అన్నానగర్‌: పుళల్‌ బాలాజీ నగర్‌ సమీపంలో ప్రైవేటు బెల్ట్‌ కంపెనీలో ఫోర్క్‌ లిఫ్ట్‌ వాహనం కూలిపోవడంతో కార్మికుడు మృతి చెందాడు. పుళల్‌ బాలాజీ నగర్‌ ఐపీసీ కన్వేయర్‌ బెల్ట్‌ కంపెనీ ఉంది. దీనిని మన్నడికి చెందిన అలీ అస్తర్‌(50) నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థలో పది మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో వ్యాసర్‌పాడి కళ్యాణపురం మొదటి కూడలికి చెందిన వెంకట చలపతి కుమారుడు రూబన్‌(27) టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గురువారం బెల్ట్‌ లోడ్‌ మోయడానికి ఫోర్క్‌ లిఫ్ట్‌ నడుపుతుండగా అది అనూహ్యంగా నేలపై పడింది. దీంతో వాహనం పైనుంచి కిందపడ్డాడు. రూబెన్‌ అదే వాహనం కింద ఇరుక్కుని రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా తోటి కార్మికులు వెంటనే రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పైలట్‌ లేక చైన్నె–సింగపూర్‌ విమానం ఆలస్యం

సేలం: పైలట్‌ లేక చైన్నె నుంచి సింగపూర్‌కు వెళ్లే విమానం 11 గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం వేకువజామున 2.50 గంటలకు చైన్నె నుంచి సింగపూర్‌ వెళ్లే విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ప్రయాణించేందుకు 152 మంది సిద్ధమయ్యారు. ఈ స్థితిలో సింగపూర్‌కు వెళ్లాల్సిన విమానం 11 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.55 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించారు. చైన్నె–సింగపూర్‌ విమానాన్ని నడపడానికి పైలట్‌ లేకపోవడం వల్లనే విమానం ఆలస్యమైందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. సింగపూర్‌ నుంచి చైన్నె వచ్చిన పైలట్‌ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లడంతో చైన్నె నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన విమానాన్ని శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు నడిపారు. దీంతో అందులో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడ్డారు.

కారు బోల్తా పడి బాలుడి మృతి

సేలం: కారు బోల్తాపడి ఓ బాలుడు మృతిచెందాడు. సేలం జిల్లా ఓమలూర్‌కు చెందిన మంజునాథన్‌ (32). ఈయన బెంగళూరులోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఇతను, కుమారుడు సిద్ధార్థ్‌ (8), స్నేహితులు శివకుమార్‌, భువనేశ్వరన్‌, కార్తీక్‌లతో శబరిమలైకు స్వామి దర్శనానికి కారులో వెళ్లారు. శబరిమలైలో అయ్యప్ప స్వామి దర్శనం ముగించుకుని గురువారం రాత్రి అదే కారులో సొంత ఊరికి బయలుదేరారు. కంబం మార్గంలో అర్ధరాత్రి వెళుతుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్‌ సంఘటన స్థలంలోనే తండ్రి కళ్లెదుటే దుర్మరణం చెందాడు. మిగిలిన అందరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుంటలో మునిగి

ఇద్దరు చిన్నారుల మృతి

తిరుత్తణి: కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుత్తణిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. తిరుత్తణి శివారులోని కన్నికాపురం గ్రామానికి చెందిన మురుగేశన్‌, అతని తమ్ముడు ఆర్ముగం. అన్నదమ్ములు ఇద్దరూ కూలీ కార్మికులు. ఇందులో మురుగేశన్‌ కుమారుడు గిరినాథ్‌(10), ఆర్ముగం కుమారుడు ప్రవీణ్‌(10) ఇద్దరు తిరుత్తణిలో ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన చిన్నారులు సమీపంలోని రాతి కుంటలో కాళ్లు, చేతులు కడిగేందుకు వెళ్లారు. అకస్మాతుగా కుంటలో పడి మునిగిపోయారు. అక్కడున్న వారు చిన్నారులను కాపాడే ప్రయత్నం చేశారు. కుంటలో మునిగిపోయిన చిన్నారులను వెలికితీసి తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారులు కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీధి కుక్కుల వీరంగం

ఐదుగురికి గాయాలు

వేలూరు: వేలూరు జిల్లా పేర్నాంబట్‌ మున్సిపాలిటీలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. కుక్కల దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేర్నాంబట్‌ మున్సిపాలిటీలోని 20 వార్డు బంగ్లామేడు ప్రాంతంలో దస్‌దగిరి అహ్మద్‌, సౌహక్‌ రోడ్డుకు చెందిన సంపత్‌తో పాటు మరో ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురు పేర్నాంబట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement