అన్నాడీఎంకే నేతల బాహాబాహి
● సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ ● నేతల ముందే నిర్వాహకుల రగడ
సేలం: అన్నాడీఎంకే బలోపేతం కోసం నెల్‌లై, కుంభకోణంలలో శుక్రవారం ఏర్పాటు చేసిన చర్చా స మావేశాల్లో నిర్వాహకులు బాహాబాహీకి దిగిన ఘ టన సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.
తిరునెల్వేలిలో రగడ
2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా సీనియర్ నేతల నేతృత్వంలో అన్నాడీఎంకే తరఫున చర్చా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నెల్‌లై జిల్లా అన్నాడీఎంకే సమావేశం ఉడయార్‌పట్టిలో ఉన్న మండపంలో మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణి, వరగూర్ అరుణాచలం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రచార కార్యదర్శి పాపులర్ ముత్తయ్య ప్రసంగిస్తూ గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ అయినప్పటికీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎక్కడికి వెళుతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. తిరునెల్వేలి, పాళయంకోట నియోజకవర్గాలలో నామ్ తమిళర్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చాయని తెలిపారు. ప్రచార పనులు సరిగ్గా చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఓటర్ల శిబిరం జరిపినప్పుడు జిల్లా కార్యదర్శి తంజై గణేష్ రాజా ఊర్లో లేరని, ఒక వార్డు కార్యదర్శిని కూడా చూడడం వీలుపడలేదని జిల్లా కార్యదర్శిని విమర్శించే విధంగా ప్రసంగించారు. దీంతో ఆగ్రహించిన జిల్లా కార్యదర్శి తంజై గణేషరాజా నేరుగా స్టేజ్‌పై ఉన్న పాపులర్ ముత్తయ్య వద్ద వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఒక కార్యకర్త స్టేజ్‌పైకి ఎక్కగా అతడిని నేత కిందకు తోసివేయడంతో గొడవ పెరిగింది. వాగ్వాదం కాస్తా బాహాబాహికి దారితీసింది. నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. సుమారు పది నిమిషాల తర్వాత స్టేజ్‌పై ఉన్న ఎస్.పి.వేలుమణి మైక్‌లో అందరినీ మందలించి, సముదాయించారు. వివాదానికి కారణమైన ఇద్దరిని మాత్రం బయటకు పంపించి మళ్లీ సమావేశాన్ని సజావుగా నిర్వహించి పూర్తి చేశారు.
కుంభకోణంలో వాగ్వాదం
తంజావూరు జిల్లా కుంభకోణం సెక్కాంకన్ని సాలైలో ఉన్న మండపంలో తంజావూరు తూర్పు జిల్లా అన్నాడీఎంకే తరఫున చర్చా సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా కార్యదర్శి భారతి మోహన్ అధ్యక్షతన తరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఆర్.కామరాజ్, కొరడా మనోహరన్‌లతోపాటు 500 మందికి పైగా నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర, వార్డు మాజీ కౌన్సిలర్ అంబికాపతి లేచి నిలబడి స్టేజ్‌పై అధ్యక్షులు మాత్రమే కాకుండా నిర్వాహకులు కూడా ప్రసంగించడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా పలువురు నినాదాలు చేయడంతో అక్కడ కలకలం రేగింది. ఆ సమయంలో అంబికాపతి స్టేజ్ పైకి ఎక్కడానికి ప్రయత్నించగా, అక్కడ ఉన్న ఒక నేత అతడిని కిందికి తోయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడి, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం దిండుగల్ శ్రీనివాసన్ జోక్యం చేసుకుని సర్ది చెప్పి తర్వాత సమావేశాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment