పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని చైన్నె హైకోర్టు మాజీ న్యాయమూర్తి కృపాకరన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో సీనియర్ న్యాయవాది వీసీ రాజగోపాలచారి వర్ధంతి కార్యక్రమాన్ని వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్బంగా పాల్గొన్న ప్రతినిధులు వీసీఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి ప్రసంగించారు. మాజీ న్యాయమూర్తి కృపాకరన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చాలా కోర్టుల్లో మౌలిక వసతులు లేవని, చాంబర్లు లేవన్నారు. కోర్టుకు వచ్చే ప్రజలకకు విశ్రాంతి గదులు లేవన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పద్ధతి మారాలన్నారు. వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ మాట్లాడుతూ వీసీ రాజగోపాలాచారి వద్దకు వచ్చే కేసులను ఎటువంటి రుసుము తీసుకోకుండా వాదించి విజయం సాధించే వారన్నారు. ఎటువంటి తప్పుడు కేసుల్లోనూ హాజరు కాకుండా న్యాయమైన కేసులు విజయం సాధించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేశారన్నారు. సుప్రీం కోర్టులోని కేసుల కోసం అధిక ఫీజులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, పేద ప్రజల కేసుల పరిష్కారం కోసం ప్రభుత్వం, న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు సంయుక్తంగా కలిసి కొత్త పద్ధతిని తీసుకు రావాలన్నారు. వీసీ రాజగోపాలాచారి వద్ద తాను న్యాయవాదిగా పనిచేసినందుకు గర్విస్తున్నాన్నారు. అందుకోసమే ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థ ముఖ్యమైనదని అయితే కేసులను త్వరగా పరిష్కరించడం లేదన్నారు. వీటి ఫలితంగా 2018వ సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.9 కోట్ల నుంచి 5.10 కోట్లకు పెరిగాయన్నారు. అందులో 1.80 లక్షల కేసులు గత 30 సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. 70 సంవత్సరాల పైబడిన తొమ్మిది కేసులు, 72 సంవత్సరాల పైబడిన 3 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. గ్లోబల్ అడ్మినిస్టేషన్ ఆఫ్ జస్టిస్ ఇండెక్స్‌లో 142 దేశాల్లో భారత్ 111వ స్థానంలో ఉందన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు మరో 324 సంవత్సరాలు పట్టవచ్చునని తెలిపారు. జైలులో 76 శాతం ఖైదీలు రిమాండ్‌లోనే ఉన్నారన్నారు. వీఐటీ ఉపాధ్యక్షురాలు కాదంబరి విశ్వనాథన్, సీనియర్ న్యాయవాది విజయరాఘవులు, వీసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment