గ్రీన్‌ఫీల్డ్ హార్బర్‌కు ఓకే!
సాక్షి, చైన్నె: కడలూరులోని పురాతన హార్బర్‌ను గ్రీన్‌ఫీల్డ్ హార్బర్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.2వేల కోట్లతో 1,200 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ హార్బర్ రూపకల్పనకు నిర్ణయించారు. తమిళాడులోని సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం కడలూరు. ఇది పురాతన నగరం. రెండు వందల సంవత్సరాల క్రితం ఆంగ్లేయులకు వ్యాపారరీత్యా ఈ నగరం ప్రధానమార్గంగా ఉండేది. ఆంగ్లేయుల హయాంలో ఇక్కడ హార్బర్ కూడా నిర్మించారు. ఇక్కడి నుంచి అప్పట్లోనే రైలు మార్గాన్ని సైతం పలు నగరాలను అనుసంధానించే విధంగా తీర్చిదిద్దారు. ఆంగ్లేయుల హయాంలో ఇక్కడకు నౌకల రవాణా జరిగేది. కాలక్రమేనా ఈ హార్బర్, రైలు మార్గాలన్నీ శిథిలావస్తకు చేరాయి. ఇక్కడి నుంచి దేశంలోని పలు నగరాలకు ప్రస్తుతం కేవలం చేపల ఎగుమతి మాత్రమే జరుగుతోంది. తమిళనాడులో చైన్నె తర్వాత తూత్తుకుడి నుంచి సరుకుల రవాణా ఎగుమతులు పెరిగాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న కడలూరును గ్రీన్‌ఫీల్డ్ హార్బర్‌గా అభివృద్ధి పరిచి సముద్ర వర్తకం విస్తృతానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.2వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్
2018లో సాగర్ మాల పథకం ద్వారా రూ.135 కోట్లను కేటాయించి ఈ హార్బర్‌ను సీపోర్టుగా తీర్చిదిద్దారు. ముఖద్వారాన్ని మరింత లోతుగా చేసి సరుకుల ఎగుమతికి, దిగుమతికి దోహదపడే విధంగా నౌకల రాకపోకలకు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 1,700 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో చిన్న పాటి సరుకుల నౌకలు ఆగేవిధంగా ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులలో తమిళనాడులోని చైన్నె, తూత్తుకుడి తర్వాత కడలూరును మరింత ప్రగతి పథకంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాదికి పది మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకుల ఎగుమతికి తగ్గ కార్యాచరణ చేసింది. సీపోర్టును రూ.2 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హార్బర్‌గా మార్చేందుకు సిద్ధమయ్యారు. 1,200 ఎకరాలలో పనులకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో పనులకు సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేయనున్నారు.
కడలూరు హార్బర్
కడలూరులో రూ.2 వేల కోట్లతో పనులు
1,200 ఎకరాల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment