రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
వేలూరు: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. వేలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ వర్షాలకు వరి, అరటి పంటతోపాటు కొబ్బరిచెట్లు పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయన్నారు. వీటికి ప్రభుత్వం సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలను వ్యవసాయ పనుల్లో నిమగ్నం చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో రైతులకు ఆత్మపథకం కింద శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. డీఆర్‌ఒ మాలతి, కో–ఆపరేటివ్ జాయింట్ డైరెక్టర్ తిరుగున అయ్యప్పదురై, సెంట్రల్ బ్యాంకు జాయింట్ డైరెక్టర్ రామదాస్, సబ్ కలెక్టర్ బాలసుబ్రమణియన్, వ్యవసాయ శాఖ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment