నత్తనడకన రైల్వేస్టేషన్ పనులు
● పిల్లర్లు దాటని పురోగతి ● పనులను వేగవంతం చేయాలని ప్రయాణికుల వినతి
తిరువళ్లూరు: అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన వేర్వేరు పనులు నత్తనడకన సాగుతున్న క్రమంలో పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు. తిరువళ్లూరు ప్రజల రాకపోకలు ప్రధానంగా రైలు ప్రయాణంపైనే ఆధారపడి సాగుతున్నాయి. తిరువళ్లూరు రైల్వేస్టేషన్ మీదుగా రోజుకు 180 సబర్మన్, 22 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌కు ఎన్‌ఎస్‌జీ–2 అంతస్తు వుండడంతో ఇక్కడ ప్రయాణికుల రద్దీ ఎంత వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వేస్టేషన్‌లను అమృత్ భారత్ పథకాన్ని వర్తింప చేసి అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులోభాగంగానే తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనుల కోసం అమృత్‌భారత్ పథకం కింద రూ.28 కోట్లతో మరమ్మతు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రధాన ముఖద్వారం నిర్మాణ పనులకు గత 2023 ఆగస్టులో పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభించి ఏడాది దాటుతున్నా ఇంతవరకు పనుల పురోగతి పిల్లర్‌లను దాటి ముందుకు సాగడం లేదు. పనులు నత్తనడకన సాగడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment