క్రిస్మస్, న్యూఇయర్ ప్రత్యేకం
● మేట్టుపాళయం–ఊటీకి ప్రత్యేక కొండ రైలు ● సేలం రైల్వే డివిజన్ అధికారులు వెల్లడి
సేలం: క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా వరుస సెలవులను పురస్కరించుకుని మేట్టుపాళయం నుంచి ఊటీకి ప్రత్యేక కొండ రైలును నడుపనున్నట్టు దక్షిణ రైల్వే ప్రకటించడంతో పర్యాటకులు అమిత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేట్టుపాళయం–ఊటీ మధ్య ప్రత్యేక కొండ రైలు నడుస్తోంది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కొండ రైలులో ప్రయాణించడానికి రాష్ట్రం నుంచే కాకుండా కేరళ, కర్ణాటక, ఆంధ్రా నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రతి ఏడాది వేసవిలో, క్రిస్మస్, న్యూఇయర్ వంటి పండుగల సమయంలో ప్రత్యేక కొండ రైలును నడపడం పరిపాటి.
కొండ రైలు పయనించే సమయం
ఈ ఏడాది క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా మేట్టుపాళయం–ఊటీ, ఊటీ–మేట్టుపాళయం మధ్య ప్రత్యేక కొండ రైలును నడుపుతున్నట్టు సేలం రైల్వే డివిజన్ నిర్వాహకులు వెల్లడించారు. ఆ మేరకు మేట్టుపాళయం నుంచి ఊటీకి డిసెంబర్ 25, 27, 29, 31 నాలుగు రోజులు ప్రత్యేక రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఉదయం 9.10 గంటల మేట్టుపాళయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. అదే విధంగా ఊటీ నుంచి మేట్టు పాళయంకు 26, 28, 30, జనవరి 1 తేదీలలో ప్రత్యేక కొండ రైలు పయనిస్తుంది. ఈ రైలు ఊటీ నుంచి ఉదయం 11.25 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు మేట్టుపాళయంకు వచ్చి చేరుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment