నేడే కౌంటింగ్
సాక్షి, చైన్నె: ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం పది గంటలకు గెలుపు ఎవరిదో అన్న మెజారిటీ ఖరారు కానుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలంగోవన్ మరణంతో ఈరోడ్ తూర్పు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. గత నెల కేంద్ర ఎన్నికల కమిషన్ నగారా మోగించింది. ఈ ఎన్నికలలో డీఎంకే అభ్యర్థిగా చంద్రకుమార్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా సీతాలక్ష్మి పోటీ చేయగా, అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే, తమిళ వెట్రి కళగంఎన్నికలను బహిష్కరించాయి. దీంతో డీఎంకే చంద్రకుమార్, సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి సీతాలక్ష్మి మధ్య ప్రధాన సమరం నెలకొంది. వీరితో పాటు 46 మంది పోటీ చేశారు. బుధవారం ఓటింగ్ జరిగింది. 72 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న 53 ప్రదేశాలలో 237 పోలింగ్ బూత్‌లలో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీ పాట్, కంట్రోల్ పానల్‌లు ప్రభుత్వం ఇంజినీరింగ్‌కళాశాల కంట్రోల్ రూమ్‌లో ఉంచారు.
ఏర్పాట్లు పూర్తి
ఇదే కళాశాలలో కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. 17 రౌండ్లుగా ఓట్లు లెక్కింపునకు చర్యలు తీసుకున్నారు. శనివారం ఉదయం ఐదు గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలోని ప్రత్యేక స్ట్రాంగ్ రూములో ఉన్న తపాలా ఓట్లకు సంబంధించిన బాక్సును కౌంటింగ్ కేంద్రానికి తీసుకు రానున్నారు. తొలుత తపాలా ఓట్ల లెక్కింపు 8 గంటల సమయంలో జరగనుంది. ఆ తర్వాత 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఇందు కోసం సర్వం సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ పరిసరాలను పూర్తిగా నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపు చంద్రకుమార్ వైపే అనేది ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే, మెజారిటీని తగ్గించే దిశగా నామ్ తమిళర్ కట్చి, స్వతంత్ర అభ్యర్థుల దూసుకెళ్లారు. 72 శాతం ఓటింగ్ జరిగిన నేపథ్యంలో డీఎంకే అభ్యర్థి ఏమేరకు ఓట్ల శాతం మెజారిటీ సాధిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా ఈ ఉప ఎన్నికను డీఎంకే పరగణించింది. ఈ దృష్ట్యా, భారీ ఆధిక్యం లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకెళ్లారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉదయం పది గంటలకు మెజారిటీ నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment