బీసీలకు రూ. 5,522 కోట్లేనా? | Bhatti Vikramarka Reacts on Telangana Assembly Budget Session 2021 | Sakshi
Sakshi News home page

బీసీలకు రూ. 5,522 కోట్లేనా?

Published Sat, Mar 27 2021 2:04 AM | Last Updated on Sat, Mar 27 2021 2:04 AM

Bhatti Vikramarka Reacts on Telangana Assembly Budget Session 2021 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో 71 శాతం సంపద ఒక శాతం జనాభా చేతిలో ఉందని, ఒక శాతం సంపదను 55 శాతం జనాభా పంచుకుంటోందని ఆక్స్‌ఫాం అనే ఎన్జీవో నివేదిక ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తంచేశారు. ఈ 55 శాతం జనాభా బలహీనవర్గాల వారిదేనని స్పష్టం చేశారు. ఈ 55 శాతం జనాభా తలసరి ఆదాయం రూ. 5,500కు మించట్లేదని ‘ఆక్స్‌ఫాం’ చెప్పిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,27,107కు పెరిగినా, ‘ఆక్స్‌ఫాం’ నివేదిక ప్రకారం ఇక్కడి 55 శాతం జనాభా తలసరి ఆదాయం సైతం రూ. 5,500కు మించదన్నారు.

రాష్ట్రంలోని సుమారు మూడున్నర కోట్ల జనాభాలో 55 శాతం అనగా 2 కోట్ల మంది తలసరి ఆదాయం రూ. 5,500 మాత్రమే ఉంటుందన్నారు. పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటివి తాత్కాలిక ఉపశమనాలేనని మంత్రి ఈటల గతంలోనే పేర్కొన్నారని భట్టి గుర్తుచేశారు. ఎస్సీలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీ, యువతకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్రూం ఇళ్ల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకొని ఉంటే తలసరి ఆదాయం పెరిగి ఉండేదన్నారు. శాసనసభ బడ్జెట్‌ 2021–22 సమావేశాలు చివరిరోజైన శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భట్టి ప్రసంగించారు.

రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 50 శాతం బీసీలకు రూ. 5,522 కోట్లు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 57 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా గత రెండేళ్ల నుంచి స్వయం ఉపాధి కల్పన సబ్సిడీలు జారీ కావట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ నడుస్తోందని, దీన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దల నుంచి పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు వేయాలని సూచించారు.

పాఠశాలలను మూసివేయడంతో ఫీజులు కట్టిన తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పబ్బులు, బార్లు, క్లబ్బులను మూసివేయాలని సూచించారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వల్ల రైతులు ఇక్కట్లు పడుతున్నారన్నారు. నీటిపారుదల, విద్యుత్‌ ప్రాజెక్టులు, ఇన్‌ఫ్రాపై ఏటా రూ. 30 వేల కోట్లు చొప్పున రూ. 3 లక్షల కోట్లు ఖర్చు పెడితే కేవలం 200–300 మంది కాంట్రాక్టర్లు లబ్ధి పొందారని భట్టి ఆరోపించారు.

బీసీ హాస్టళ్లలో నెల మెస్‌ బిల్లు రూ. 950 మాత్రమే ఇస్తున్నారని, రోజుకు రూ. 31తో మూడు పూటలా తిండి ఎలా తినాలని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందిస్తూ బీసీ హాస్టళ్లు గత 70 ఏళ్లలో నీళ్ల చారు, పురుగుల అన్నమే పెట్టేవారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 17 గురుకులాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం వాటిని వెయ్యికి పెంచిందని భట్టికి కౌంటర్‌ ఇచ్చారు.

రాయలసీమ లిఫ్టును అడ్డుకోవాలి...
కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తుండటంతో ఖమ్మం, నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతాంగంతోపాటు  హైదరాబాద్‌ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement