కరీంనగర్‌లో వరద ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటన
సాక్ష, కరీంనగర్: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆగకుండా వాన కురుస్తూనే ఉండటంతో.. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాగులు ఉప్పొంగడంతో పెద్ద సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. శాతవాహన వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.
► కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో కమాన్‌పూర్ వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. సైదాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి మండలాల్లో రోడ్లు తెగిపోయాయి. కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్ షాప్, విద్యానగర్, కట్టరాంపూర్, జ్యోతినగర్, రాంనగర్, మంకమ్మతోట, హోసింగ్‌బోర్డ్ ప్రాంతాలు నీటమునిగాయి. జగిత్యాలకు వెళ్లే హైవేపై భారీగా నీరు నిలిచింది. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.
కరీంనగర్‌లో ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతంలో రోడ్డుపై భారీగా నిలిచిన నీరు
► కుండపోత వానతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం చెరువుగా మారిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొత్త చెరువు పొంగడంతో కరీంనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్ల కొత్త కలెక్టరేట్ మళ్లీ వరదలో చిక్కుకుంది. సిరిసిల్ల పట్టణంలో చేనేత పరిశ్రమలు ఉండే పలు ప్రాం తాలు నీటమునిగాయి.
► కుండపోత కారణంగా జగిత్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మండలంలో గోదావరిలో ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. కథలాపూర్ మండ లం తుర్తి గ్రామం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌లో పలు కాలనీలు నీటమునిగాయి. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామ శివారులోని చెరువు మత్తడి నీటిలో కారు కొట్టుకుపోగా, చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న ఉత్తరప్రదేశ్ యువకుడు
► సిరిసిల్లను వరద ముంచెత్తడంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. మంత్రి ఆదేశాల మేరకు.. హైదరాబాద్ నుంచి డీఆర్‌ఎఫ్ బృందాలు, జీహెచ్‌ఎంసీ నుంచి మరో బృందం సిరిసిల్లకు చేరి సహాయక చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంతాల్లోని బాధితులను బోట్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతికి వేములవాడలోని మూల వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కాగా, ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధమైంది. ఇక, ఆసియా ఖండంలోనే మొదటిదైన సరళాసాగర్ ప్రాజెక్టు సైఫన్లు మరోసారి ఆటోమేటిగ్గా తెరుచుకున్నాయి. వరద పోటెత్తడంతో ఉడ్ సైఫన్లు తెరుచుకుని నీరు దిగువనకు విడుదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment