రెండుమార్లు స్నానం.. మళ్లీ మళ్లీ కడిగేస్తున్నారు! | Hyderabad People Using Water More Than Two Times | Sakshi
Sakshi News home page

మళ్లీ.. మళ్లీ.. కడిగేస్తున్నారు!

Published Wed, Aug 5 2020 9:11 AM | Last Updated on Wed, Aug 5 2020 9:11 AM

Hyderabad People Using Water More Than Two Times - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘ఎల్భీనగర్‌లో నివసించే విక్రమ్‌ ఇటీవలి కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగొచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం అలవాటు చేసుకున్నాడు. కోవిడ్‌ భయంతో రోజుకు 2–3 సార్లు స్నానం చేయడం..4–5 సార్లు చేతులు, కాళ్లు కడుక్కుంటున్నారు. దీంతో ఐదుగురు నివాసం ఉండే వారింట్లో నీటివినియోగం అనూహ్యంగా పెరిగింది’.  ఈ పరిస్థితి విక్రమ్‌ ఒక్కరిదే కాదు..గ్రేటర్‌సిటీజన్ల అందరిదీ. కోవిడ్‌ పంజా విసరడంతో నగరంలో పాజిటివ్‌కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకుఅధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పలుమార్లు స్నానంచేయడం, చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం చేస్తున్నారు. దీంతో ఇళ్లలో నీటివినియోగంఅనూహ్యంగా పెరిగింది.

మహానగరం పరిధిలోని సుమారు 10.60 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 204 కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. ప్రధాన నగరంలో ప్రతీ ఒక్కరికీ నిత్యం 130 లీటర్లు, శివారు ప్రాంతాల్లో ఒక్కొక్కరికీ 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తోంది. ఇక జలమండలి తాగునీటి సరఫరా నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో స్థానికులు బోరుబావుల నీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బోరుబావుల నుంచి నిత్యం సుమారు 300 కోట్ల లీటర్ల నీటిని సిటీజనులు తోడేస్తున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో భూగర్భజలమట్టాలు పెరగడంతో బోరుబావుల్లో సమృద్ధిగా నీటినిల్వలుండడంతో వ్యక్తిగత అవసరాలకు నీటిఇక్కట్లు లేకపోవడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక్కో వ్యక్తికి నిత్యం తాగడానికి, స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం ఇతర వ్యక్తిగత అవసరాలకు సుమారు 130 లీటర్ల నీరు అవసరం. నగరంలో ఆమేర నీటి లభ్యత ఉంది. 

వర్షాకాలంలోనూ.... 
సాధారణంగా వర్షాకాలం సీజన్‌లో నీటివినియోగం తగ్గడం పరిపాటే. కానీ ఈసారి మార్చి నెల నుంచి ప్రస్తుత తరుణం వరకు నీటి వినియోగం క్రమంగా పెరుగుతుందే కానీ..తగ్గడంలేదు. ప్రస్తుతం జలమండలి కృష్ణామూడుదశలు,గోదావరి మొదటి దశతోపాటు జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నిత్యం 204 కోట్ల లీటర్లు(2047 మిలియన్‌ లీటర్లు) నీటిని సేకరించి శుద్ధిచేసి 10.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫరా చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటి తరలింపు,శుద్ధి చేసేందుకు ప్రతీ వెయ్యి లీటర్లకు జలమండలి రూ.45–50 ఖర్చు చేస్తుండగా..వినియోగదారుల నుంచి రూ.10 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని సుమారు 23 లక్షల బోరుబావుల నుంచి నిత్యం సుమారు 300 కోట్ల లీటర్ల నీటిని తోడేస్తూ వివిధ గృహ, వాణిజ్య అవసరాలకు సిటీజన్లు వినియోగిస్తుండడం విశేషం. 

ఈ ఏడాది నీటికొరత లేనట్టే.. 
గ్రేటర్‌ నగరానికి తాగునీరందిస్తోన్న నాగార్జునసాగర్‌ (కృష్ణా), ఎల్లంపల్లి (గోదావరి), జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల్లో ఇటీవలి వర్షాలకు నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. రాగల 2 నెలల్లో ఈ జలాశయాలు నిండుకుండల్లా మారతాయని ఆశిస్తున్నాం. ఆయా జలాశయాల్లో నీటినిల్వలు సమృద్ధిగా ఉంటే నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగరవాసులు ప్రతి ఒక్కరికీ నిత్యం 130 లీటర్ల స్వచ్ఛమైనతాగునీరందించడమే జలమండలి లక్ష్యం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement