కార్పొరేట్ ‘వల’పుతో గిలగిల..
పరిస్థితి ఆశాజనకంగా లేని థియేటర్లు మూసి ఉండటంతో పలు వ్యాపార సంస్థలు వాటిని సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లకు అద్దె రూపేణా వస్తున్న ఆదాయానికి రెట్టింపు ఆదాయాన్ని హామీ ఇవ్వడానికి కూడా ఇవి సిద్ధపడుతున్నాయని తెలుస్తోంది. ఈ రకమైన ఆఫర్లతో ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ తమ రిటైల్ వ్యాపార కార్యకలాపాల కోసం సిటీలోని పలు థియేటర్లను లీజుకు తీసుకున్నట్లు సమాచారం.
నగరవాసులకు ప్రధాన వినోద కేంద్రం సినిమా థియేటర్.. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులతో కలిసి సినిమా హాల్లో వాలిపోవాల్సిందే.. ఏ నలుగురు ఫ్రెండ్స్ కలిసినా ముందుగా గుర్తొచ్చేది సినిమానే.. ఇదంతా లాక్‌డౌన్‌కు ముందు ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారింది. అందరికీ వినోదాల కేంద్రంగా మారిన సినిమా హాల్స్ ప్రస్తుతం మూసివేత దిశగా ప్రయాణిస్తున్నాయి. జంట నగరాల్లోని థియేటర్లను కరోనా కాటేసింది. ఇదే అదనుగా వ్యాపార విస్తరణలో ఉన్న కార్పొరేట్ సంస్థలు సినిమా హాల్స్‌పై ఆఫర్లతో ‘వల’పు వేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో, బంజారాహిల్స్
అన్‌లాక్ కాని థియేటర్లు..
ఇప్పటికీ కొన్ని థియేటర్లు తెరుచుకోకపోవడానికి లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఆర్థిక నష్టాలు కారణంగా చెబుతున్నారు. ఇప్పటిదాకా రూ.లక్షల్లో పేరుకుపోయిన కరెంటు బకాయిలు చెల్లించాల్సి రావడం కూడా ‘తెర’చుకోకపోవడానికి కారణాల్లో ఒకటి. నగదు రొటేషన్ ఉన్నప్పుడు బయటపడని భాగస్వాముల వివాదాలు రచ్చకెక్కడం, థియేటర్లు మూసి ఉన్నా సిబ్బందికి 50శాతం చొప్పున జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు బడా వ్యాపార సంస్థల వ్యాపార విస్తరణ యత్నాలకు స్ఫూర్తినిస్తున్నాయి.
కోవిడ్ నిబంధనలతో ఈ నెల 4న థియేటర్లు తెరుచుకునేందుకు నిబంధనలతో కూడిన అనుమతిచ్చారు.. అయినా నగరంలో చాలా థియేటర్లు ఇంకా మూసే ఉన్నాయి. కొన్ని మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్‌ల్లో భాగంగా ఉన్న సినిమా హాల్స్ మాత్రమే ఇతర భాషా చిత్రాలతో నడుస్తున్నాయి. వీటిలో సగం సీట్లలో మాత్రమే ప్రేక్షకులకు అనుమతి ఉన్నా నడుస్తున్న థియేటర్లలోనూ 5 శాతం సీట్లు మించి భర్తీ కావడం లేదు. ఇప్పటి వరకు కొత్త తెలుగు సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఊపందుకోవడం వంటివి కారణమవుతున్నాయి.
ఓటీటీ.. వేటేస్తుందా?
►లాక్‌డౌన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఊపందుకున్నాయి. ఇంట్లో ఉండే సినిమాను ఆస్వాదించే అలవాటు ప్రజల్లో స్థిరపడింది. ఈ పరిస్థితుల్లో థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు ఎంత వరకూ వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది కూడా థియేటర్ల నిర్వహణ పట్ల యజమానుల నిరాసక్తతకు కారణంగా మారుతోంది.
►థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో కొంతమంది మాత్రం ఎదురు చూస్తున్నారు. కొంత మంది థియేటర్లను నడిపించలేక, అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుండగా రెట్టింపు ఆదాయం ఆఫర్ చేస్తున్న అమేజాన్ చాలా థియేటర్లను లీజుకు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
►పాతవి మూతపడుతుంటే.. కొత్తవి వస్తాయిలే అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి నిబంధనల ప్రకారం సినిమా హాల్ నిర్మించాలంటే కనీసం 2,300గజాలు ఉండాలి. మల్టీఫ్లెక్స్ అయితే 3,700
గజాలు కావాలి.
నిబంధనలతో నిర్వహణ కుదేలు..
నగరంలో 80కిపైగా ఉన్న థియేటర్ల అద్దెలు ప్రాంతాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.3 నుంచి రూ.4 లక్షల వరకూ ఉన్నాయి. అలాగే క్యాంటీన్లు అద్దెలు, పార్కింగ్ ఆదాయం అదనం. వచ్చే ఆదాయంలోంచి చెల్లించాల్సిన వాటిలో మినిమం కరెంటు బిల్లు రూ.లక్ష పైచిలుకు ఉంది. అలాగే పెద్ద సంఖ్యలో సిబ్బంది జీతభత్యాలు, ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం ఉన్నా లేకపోయినా ఇవి తప్పవు. లాక్‌డౌన్ ముందు పునర్నిర్మాణం చేయాలంటే రూ.కోట్లు పెట్టుబడి కావాలనే ఆలోచనతో.. వెనకంజ వేస్తూ అత్తెసరు లాభాలతో, కొద్దోగొప్పో నష్టాలొచ్చినా భరిస్తూ నడిపిస్తున్నవారే ఎక్కువ..
లాక్‌డౌన్ టూ గోడాన్..
నారాయణగూడ చౌరస్తాలో 1969 నుంచి.. 50 ఏళ్లుగా ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచిన శాంతి థియేటర్ 8 నెలలుగా మూతపడింది. తద్వారా ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు యాజమాన్యం గోడాన్‌గా మార్చి లీజుకు ఇవ్వాలని సిద్ధమైంది. ఒక్క శాంతి టాకీస్ మాత్రమే కాదు.. గెలాక్సీ, సుష్మ, మెఘా, శ్రీమయూరి, శ్రీరామ, వెంకటాద్రి, సాయిరాజా, అంబ ఇవి కాకుండా మియాపూర్ పరిసర ప్రాంతాల్లో మరో 2 థియేటర్లు వెరసి సుమారుగా 25 వరకూ థియేటర్లు నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు గోడాన్ల అవతారమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంకొన్ని థియేటర్లను కూల్చేసి మాల్స్ నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కొత్త సినిమాలతో పూర్వవైభవం..
వచ్చే ఏడాదిలో వకీల్‌సాబ్, ఆర్‌ఆర్‌ఆర్, క్రాక్, రెడ్, సోలో బ్రతుకే సో బెటర్‌లాంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలు థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. కాబట్టి త్వరలోనే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నాం. 8 నెలలుగా నెలకు రూ.8 లక్షల వరకు నష్టపోయాం. ఇప్పుడు థియేటర్లలో సీట్ల మధ్య గ్యాప్ నిబంధన పెట్టారు. దేవి 70 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎంలో 1,380 చొప్పున సీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 690 సీట్లకు టిక్కెట్లు ఇవ్వాలి. అయితే ప్రస్తుతం రోజుకు 100 నుంచి 180 మంది మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారు.
– బాల గోవిందరాజ్, జాయింట్ సెక్రటరీ, తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్. యజమాని, దేవి 70 ఎంఎం.
శాంతి టాకీస్‌ను 1969లో ప్రారంభించాం. ఇప్పుడైతే థియేటర్ మూసి ఉంది. ఒక వేళ తెరిచినా నెలకు రూ.2 లక్షల వరకు నష్టం భరించే స్థితిలో మేములేం. గోడాన్‌గా లీజుకు ఇచ్చేందుకు ప్రపోజల్ పెట్టుకున్నాం.
– పిచ్చేశ్వర్‌రావు, శాంతి టాకీస్ యజమాని
గోడాన్‌గా మారుస్తున్నాం..
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శ్రీమయూరి థియేటర్‌ను 1969లో ప్రారంభించాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్, థియేటర్లకు వరాలు కురిపిస్తూ కరెంటు మినిమం చార్జీలుండవని చెప్పారు. అయితే 3 రోజుల క్రితం మా థియేటర్‌లో కరెంటు బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేశారు. ఈ కష్ట నష్టాలను భరించే ఓపిక లేకే గోడాన్‌కు లీజుకు ఇవ్వాలని నిర్ణయించాం.
– వెంకటకృష్ణ, శ్రీమయూరి థియేటర్ యజమాని
Comments
Please login to add a commentAdd a comment