సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అభివృద్ధి నినాదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే బీజేపీ మునుగోడులో బరిలోకి దింపుతోంది. ఆయన రెండోసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయబోతున్నారు. అంతకుముందు ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మునుగోడు నియోజకవర్గంలోనే ప్రారంభమైంది. మొదట సేవా కార్యక్రమాలు చేపట్టి తరువాత రాజకీయాల్లోకి దిగారు. 2008 సెప్టెంబరులో మొట్టమొదటగా నియోజకవర్గంలోని గట్టుప్పల్ గ్రామంలో ఓ చేనేత కార్మికుడు అప్పుల బాధ తట్టుకొలేక ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు.
ఆ తరువాత అక్టోబర్ నెలలో మునుగోడు మండలంలోని చల్మెడ గ్రామంలో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి అదే గ్రామంలో దాదాపు 10వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పటి నుంచి మునుగోడు ప్రజలకు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మొదటి దశ కరోనా సమయంలో రాజగోపాల్‌రెడ్డి తన తల్లి పేరుతో ఉన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.5 కోట్లు ఖర్చుచేసి దాదాపు 50 వేల కుటుంబాలకు చేయూత అందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో భువనగిరి ఎంపీగా గెలిచి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు.
ఆ తరువాత 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు నుంచే ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినందునే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదని, ఉప ఎన్నికలు వచ్చిన చోటే టీఆర్‌ఎస్ అభివృద్ధిపనులు చేస్తోందని పేర్కొన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు.
అభ్యర్థులు ఖరారు.. ఇక ప్రచారం జోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. పోటీలో నిలిపే వారిని ఆయా పార్టీలు ఖరారు చేశాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగా, శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. తాజాగా శనివారం బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టిపెట్టనున్నారు.
పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు ప్రచారం హోరా హోరీగా సాగనుంది. మొన్నటివరకు అభ్యర్థులను ప్రకటించకపోయినా అందరూ కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో మునుగోడులో సమరం జోరందుకోనుంది. ఇప్పటికే మొదలైన నామినేషన్ల పర్వం ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. నామినేషన్లకు అంతా సిద్దమవుతున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిందంటే ఇక పూర్తి స్థాయి ప్రచారంలోకి దూకనున్నారు. ఇప్పటికే బీజేపీ, టీఆర్‌ఎస్ నియోజకవర్గంలో 100 మంది ఓటర్లకు ఓ ఇన్‌ఛార్జీని నియమించి ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి.
కాంగ్రెస్‌పార్టీ మండలాల వారీగా నియమితులైన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మండలాలకు చేరుకుంటున్నారు. టీఆర్‌ఎస్ మండలాల వారీగా నియమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా మండలాలకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చౌటుప్పల్‌లో పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు రానున్నారు. రాష్ట్ర మంత్రులు, సీఎం, కేంద్ర మంత్రుల సభలు సమావేశాలు, రోడ్ షోలతో నియోజకవర్గం హోరత్తనుంది.
Comments
Please login to add a commentAdd a comment