ఓట్ల కొనుగోళ్లపై కూటమి ఫోకస్‌ | Sakshi
Sakshi News home page

ఓట్ల కొనుగోళ్లపై కూటమి ఫోకస్‌

Published Tue, May 7 2024 10:15 AM

ఓట్ల కొనుగోళ్లపై కూటమి ఫోకస్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల పోలింగ్‌లో అనుకూలంగా లేకపోవడంతో కూటమి అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. దీంతో పల్లెలు, పట్టణాలు, నగరాల్లోని ఓటర్ల కొనుగోలుపై దృష్టి సారించారు. తిరుపతి నగరంలో కూటమి అభ్యర్థి తాను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో ఇద్దరు కార్పొరేటర్లను భారీగా నగదు, బంగారం ఆభరణాలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరికొందరు కార్పొరేటర్ల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇకపోతే ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ఉండేందుకు కొందరు అధికారులను రోజూ మద్యం బార్లకు తీసుకెళ్లి బేరసారాలు అడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం బార్లలో కుదిరిన బేరంతో కొందరు అధికారులు నగదు, బంగారు ఆభరణాలు తీసుకొస్తుండగా తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో బొజ్జల అనుచరులు వాట్సాప్‌ కాల్‌ చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారు. కుటుంబ యజమాని ఫోన్‌ తియ్యకపోతే.. ఆ గ్రామాల్లో ఉన్న అనుచరుల ద్వారా బంధువులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇది ఒక్క శ్రీకాళహస్తిలోనే కాదు.. కుప్పం నుంచి గూడూరు వరకు నిత్యం గ్రామాల్లో జరుగుతున్న తంతు. కూటమి అభ్యర్థుల మాట వినకపోతే వారితో గొడవలకు దిగి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement