అయోమయం.. గందరగోళం | - | Sakshi
Sakshi News home page

అయోమయం.. గందరగోళం

Published Thu, Sep 26 2024 1:40 AM | Last Updated on Thu, Sep 26 2024 1:40 AM

అయోమయం.. గందరగోళం

● హాల్‌ టికెట్‌ లేకుండానే ఐసీడీఎస్‌ పరీక్షలు ● అధికారుల తీరుపై అభ్యర్థుల అసంతృప్తి

తిరుపతి అర్బన్‌ : తిరుపతి–కరకంబాడి మార్గంలోని శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లా ఐసీడీఎస్‌ పరిధిలోని 16 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షకు హాల్‌ టిక్కెట్లు లేకుండా పరీక్ష రాయించారు. ఈ క్రమంలో అభ్యర్థులను ఆధార్‌ కార్డును తెచ్చుకోవాలని ముందురోజు సూచించారు. ఆధార్‌కార్డులు చూపించిన వారిని హాల్లోకి అనుమతించారు. అయితే పరీక్ష ఉంటుందనే సమాచారాన్ని దరఖాస్తు చేసుకున్న 210 మందికి ముందుగా అధికారులు తెలియజేయలేదనే విమర్శలున్నాయి. కనీసం సిలబస్‌ వివరాలు, ఎన్ని మార్కులకు పరీక్ష ఉంటుంది.. ఎంత సమయం ఇస్తారు అనే సమాచారాన్ని అభ్యర్థులకు ముందుగా తెలియజేయలేదు. దీంతోనే వారంతా అయోమయానికి లోనయ్యారు. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే గందరగోళంగా పరీక్ష నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమయపాలన లేదు

ఉదయం 9 గంటలకు పరీక్ష ఉంటుందని సమాచారం ఇచ్చిన ఐసీడీఎస్‌ అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్న పత్రం ఇచ్చి 12.30 వరకు నిర్వహించారని అభ్యర్థులు వెల్లడించారు. పరీక్షకు 30 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని తెలిపారు. లెటర్‌ రైటింగ్‌కు 20 మార్కులు, ఎక్సెల్‌లో గణాంకాలకు 15 మార్కులు, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌కు 10 మార్కులు, తిరుపతి కార్పొరేషన్‌ సమాచారాన్ని ఇంటర్నెట్‌లో చూపడానికి 5 మార్కులు చొప్పున మొత్తం 50 మార్కులకు నిర్వహించినట్లు వివరించారు. అయితే సిలబస్‌ ముందుగా అభ్యర్థులకు తెలియకపోవడంతో గందరగోళానికి గురైనట్లు తెలిపారు. ఈ క్రమంలో 16 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో 50శాతం మంది ఐసీడీఎస్‌లో సిబ్బందే వారే ఉన్నారని చర్చసాగుతోంది. అందుకే పరీక్షను గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. మరోవైపు ఓ వ్యక్తి ఒక్కో పోస్టుకు రూ.లక్ష ఇవ్వాలని అభ్యర్థుల నుంచి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పారదర్శకంగానే పరీక్ష

పారదర్శకంగానే పరీక్ష నిర్వహించాం. 210 మందికి గాను 99 మంది మాత్రమే హజరయ్యారు. మంగళవారం ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో సిలబస్‌ పెట్టాం. ఆ మేరకు ఆదే ప్యాట్రన్‌లో పరీక్ష చేపట్టాం. అందరికి ఒక్కరోజు ముందుగా సమాచారం ఇచ్చాం. పరీక్షలో మెరిట్‌ మార్కులు ప్రకారం పోస్టులు భర్తీ చేస్తాం.

– జయలక్ష్మి,

ఐసీడీఎస్‌ పీడీ, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement