బడిగంటపై ఆందోళన!
తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, పిచ్చాటూరు మండలం, రాజానగరం జెడ్పీ హైస్కూల్‌లో 210 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలకు చుట్టుపక్కల ఉన్న 15 నుంచి 20 గ్రామాల విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈ హైస్కూల్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదు. కూటమి ప్రభుత్వం పాఠశాలల సమయం పెంచితే ఆ విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా తిరుపతి జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల పనివేళలు పెంచనున్నారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వింత పోకడలకు తెరలేపుతోంది. హైస్కూళ్లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం పెంచేందుకు నిర్ణయం తీసుకుని పైలెట్ ప్రాజెక్టుగా పలు పాఠశాలల్లో అమలు చేసేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల గైర్హాజరు
తిరుపతి జిల్లాలో 2,354 ప్రభుత్వ పాఠశాలలుండగా.. ఒకటి నుంచి పదో తరగతి వరకు 1,87,444 మంది చదువుతున్నారు. ఇందులో 1,66,276 మంది విద్యార్థులు పాఠశాలలకు రెగ్యులర్‌గా విచ్చేస్తుండగా.. మిగిలిన 21,168 మంది అనేక కారణాలతో పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ప్రభుత్వం గంట సమయం పెంచితే మరింత మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యే అవకాశం ఉన్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అయ్యోర్లపై రెట్టింపు భారమే
ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకే పాఠశాలకు చేరుకోవాలంటే దూరాన్ని బట్టి ఇంటివద్ద 7 లేదా 8 గంటలకే బయలుదేరాలి. సాయంత్రం 5 వరకు బడిలోనే ఉంటే ఇంటికి చేరుకొనేసరికి రాత్రి 7 అవుతుంది. అంటే అయ్యేర్లు ప్రభుత్వ విధుల కోసమే రోజులో 10 నుంచి 12 గంటలు కేటాయించాల్సి వస్తుంది. మహిళా ఉపాధ్యాయులకు ఇది కష్టకాలమే. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల ఊసెత్తలేదు. జూలైలో మాత్రమే ఒకటో తేదీన వేతనాలు అందాయి. మధ్యంతర భృతి ప్రకటిస్తుందని ఆశించినా.. ప్రస్తుత బడ్జెట్లో ఆ ఊసేలేదని పలువురు మండిపడుతున్నారు.
తిరుపతి జిల్లా సమాచారం
ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్ 251
కేజీబీవీ, ఏపీ మోడల్, రెసిడెన్షియల్ 140
ప్రైవేట్ ఎయిడెడ్ హైస్కూల్స్ 30
విద్యార్థుల సంఖ్య 59,871
హైస్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్లు 5,152
కూటమి
సర్కారు
నిర్ణయం పట్ల వ్యతిరేకత
నిర్ణయం మార్చుకోవాల్సిందే
అనాలోచిత నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తిరుపతి జిల్లాకు సమీపంలో ఉన్న తమిళనాడులో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.10 వరకు, కర్ణాటక లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పాఠశాలల పనివేళలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో సైతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
సమయం పెంపు
లాభమా? నష్టమా?
నిర్ణయం
మార్చుకోకపోతే
ఆందోళన తప్పదని హెచ్చరిక
పాఠశాలల పనివేళలను సాయంత్రం పూట మరో గంట పెంచడం వల్ల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలను 8 గంటలపాటు పాఠశాలలో కూర్చోబెట్టడం తగదని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. గ్రామాలకు సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో పిల్లలు 5 గంటల వరకు పాఠశాలలోనే గడిపితే ఇంటికి వెళ్లడానికి ఆలస్యమవుతుందని అంటున్నారు. ఒక్కో పీరియడ్ 45 నిమిషాల వంతున 8 పీరియడ్లను పెట్టడం వల్ల విద్యార్థులు మరింత అలసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రార్థన సమయాన్ని 15 నుంచి 25 నిమిషాలకు పెంచడం కూడా అభ్యంతరకరమేనని.. చెబుతున్నారు.
ఆ నిర్ణయం సరికాదు
ఇప్పటికే రకరకాల యాప్‌లు, శిక్షణలు, వివిధ బోధనేతర పనులతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు మరలా తలకు మించిన భారంగా పాఠశాలల సమయం పెంచడం సరికాదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచడం వల్ల ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి.
– బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు,
తిరుపతి జిల్లా
అసంబద్ధ విధానం
ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు స్వస్థి పకలాలి. పాఠశాలల్లో పని వేళలను పెంచడం శాసీ్త్రయ విధానానికి, మనో విశ్లేషణ సిద్ధాంతానికి వ్యతిరేకం. అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఉదయం 9.10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు.
– ముత్యాలరెడ్డి, తిరుపతి జిల్లా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
తమిళనాడులో సాయంత్రం 4.10 వరకే
జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులో ఉదయం 9.నుంచి సాయంత్రం 4.10 వరకు పాఠశాలలు నిర్వహిస్తారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో 9.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో కూడా ఇటువంటి విపరీత ధోరణులు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో పని వేళలు పెంచడానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టడం ఏంటి?.
– విజయ్, ఆపస్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి.
Comments
Please login to add a commentAdd a comment