శ్మశానంలో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు
● వెంటనే ఆక్రమణలు తొలగించండి ● పాత శ్మశానాన్ని కొనసాగించండి ● ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న స్థానికులు
తిరుపతి అర్బన్: ‘తిరుపతి తిమ్మినాయుడుపాళెం ఎస్సీ కాలనీలోని శ్మశానాన్ని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఆక్రమించేశారు. వెంటనే వాటిని తొలగించండి’ అంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన 50వ డివిజన్ కార్పొరేటర్ అనిల్‌తోపాటు స్థానికులు డిమాండ్ చేశారు. సోమవారం తిమ్మినాయుడుపాళెం పరిధిలోని తిరుమలనగర్ సచివాలయ సమీపంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతోపాటు టీడీపీ, జనసేన నేతలు, ఆర్టీవో రామమోహన్, తహసీల్దార్ కేపీ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రభుత్వ భూములు ఆక్రమించి ఉంటే వెంటనే వాటిని తొలగించి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో శ్మశానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు జోక్యం చేసుకుని తిమ్మినాయుడుపాళెం ఎస్సీకాలనీకి శ్మశానం లేదని, సమీపంలో ఫారెస్ట్ భూములు ఉన్నాయని, అందులో శ్మశానం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. అక్కడే ఉన్న 50 డివిజన్ కార్పొరేటర్ అనీల్‌తోపాటు పలువురు స్థానికులు కలుగజేసుకుని తమకు వందేళ్ల నుంచి శ్మశానం ఉందని చెప్పారు. అయితే ఆ శ్మశాన స్థలాన్ని పలువురు టీడీపీ నేతలు ఆక్రమించారని, ఆక్రమణలు తొలగిస్తే తమకు శ్మశానం సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దీంతో జోక్యం చేసుకున్న పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీకి చెందిన కార్పొరేటర్‌తోపాటు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
రోడ్డుపైనే రెవెన్యూ సదస్సు
తిరుమల నగర్‌లోని సచివాలయానికి సమీపంలో రోడ్డుపైనే రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఆ మార్గం మీదుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కలెక్టర్ వెంకటేశ్వర్ ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉండే ప్రాంతంలో రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడంతోపాటు సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలావుండగా రెవెన్యూ సదస్సుకు మొత్తం 70 అర్జీలు వచ్చాయి. అందులో 50 శాతం అర్జీలు 22ఏ భూసమస్యల కింద వచ్చినవేనని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ 1వ వార్డు కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి, టీడీపీ నేతలు నరసింహయాదవ్, కృష్ణయాదవ్, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, శ్రీధర్‌వర్మ, జనసేనా పార్టీ నేత రాజారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment