ఆరు నెలల్లో రూ.15 వేల కోట్ల భారం
● ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు, ధరలు పెంచమన్న చంద్రబాబు ● 27న విద్యుత్ చార్జీల పెంపుపై వినతి పత్రాల సమర్పణ ● ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపు
తిరుపతి మంగళం: ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నీచుడు చంద్రబాబు అని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 27వ తేదీన విద్యుత్ కార్యాలయాల్లో వినతిపత్రాలను సమర్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈనేపథ్యంలో సోమవారం తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసంలో కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట పోస్టర్‌ను ఆయనతోపాటు మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. హామీలు తప్ప అమలు ఏదీ చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎన్నికలముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు, ఽఇతర ధరలు ఏవీ పెంచమన్న చంద్రబాబు.. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ. 15వేల కోట్లు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని మండిపడ్డారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడం, ఎవ్వరినైనా వంచించడం, నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబు నైజమన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని కూడా నెరవేర్చని ప్రజాద్రోహి చంద్రబాబు అన్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలతో కలిసి పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటరెడ్డి, కోటూరు ఆంజనేయులు, అజయ్‌కుమార్, నల్లాని బాబు, పెరుగు బాబూయాదవ్, తిరుమలరెడ్డి, అనీల్‌రెడ్డి, ఇమ్రాన్‌బాషా, ఉదయ్‌వంశీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment