చాంపియన్లుగా నిలవడం గర్వకారణం
తిరుపతి సిటీ: చైన్నె ఎస్‌ఆర్‌ఎమ్ వర్సిటీ వేదికగా మూడు రోజులగా జరిగిన సౌత్‌జోన్ అంతర్‌వర్సిటీ సాంస్కృతిక పోటీలలో ఎస్వీయూ విద్యార్థులు సాధించిన విజయాలతో వర్సిటీ గర్వపడుతోందని వీసీ సీహెచ్ అప్పారావు కొనియాడారు. మంగళవారం వర్సిటీ వీసీ చాంబర్‌లో ఆయన రిజిస్ట్రార్ భూపతినాయుడుతో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వర్సిటీ కళాకారుల బృదం 11 అంశాలలో పథకాలు సాధించిందని, విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావడం అభినందనీయమన్నారు. సౌత్‌జోన్ పోటీలలో ఫైనార్ట్స్ విభాగంలో ప్రతిభ చూపిన ఓవరాల్ చాంపియన్‌గా వర్సిటీని నిలిపిన విద్యార్థుల ప్రతిభ మరువలేనిదన్నారు. సౌత్‌జోన్ పోటీలలో విజయం సాధించిన బృందం నోయిడా అమిటీ వర్సిటీలో మార్చిలో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. అనంతరం చాంపియన్‌గా నిలచిన విద్యార్థులను, టీటీడీ ట్రైనర్ డాక్టర్ సాగర్‌ను వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు. టీమ్ మేనేజ్‌మెంట్ మురళీధర్, కో–ఆర్డినేటర్ డాక్టర్ వివేక్, ప్రొఫెసర్లు చెండ్రాయుడు, ఊక రమేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ పాకనాటి హరికృష్ణ, డాక్టర్ రంజిత్ పాల్గొన్నారు.
కొత్త సీఎస్.. చెర్లోపల్లి విద్యార్థి
తిరుపతి రూరల్: రాష్ట్రానికి నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ హైస్కూల్ విద్యాభ్యాసం తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి హైస్కూల్లోనే జరిగింది. విజయానంద్ తండ్రి పశుసంవర్థక శాఖలో పనిచేస్తుండేవారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలానికి వచ్చారు. ఈ నేపథ్యంలో నాడు 8, 9, 10 తరగతి తరగతులను చెర్లోపల్లి హైస్కూల్లో పూర్తిచేసుకున్నారు. తరగతిలో విజయానంద్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేవాడని నాటి స్నేహితులు గుర్తుచేసుకుంటున్నారు.
విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై
ప్రజాభిప్రాయ సేకరణ
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) 2025–26 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన ఆర్థిక ఆవశ్యకత, విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఈనెల 7, 8, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఇఆర్‌సీ) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు తెలిపారు. జనవరి 7, 8 తేదీల్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లోనూ, 10వ తేదీన కర్నూలులోని రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వినియోగదారులు, అభ్యంతరదారులు తమ సూచనలు, అభ్యంతరాలను వెల్లడించవచ్చని తెలిపారు.
స్విమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స
తిరుపతి తుడా: చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం, చిన్న తాయారు గ్రామానికి చెందిన వెల్లిగరం శ్యామల(44) శ్వాస కోస వ్యాధితో బాధపడుతూ డిసెంబర్ 10వ తేదీన స్విమ్స్‌లో అడ్మిషన్ పొందారు. రోగిని పరీక్షించిన వైద్యులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. యూరిన్ విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కార్డియోజెనిక్ షాక్ విత్ అక్యుట్ రెనాల్ ఫెయిల్యూర్లో ఉన్నారని, గుండెకు సంబంఽధించిన రెండు కవాటాలు పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు. దీంతో వైద్య బృందం ఐయోటిక్ రూట్ ఎన్ లాడ్జ్‌మెంట్ అనే మేజర్ పద్ధతి ద్వారా రోగికి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్య బృందాన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ అభినందించారు. అనంతరం రోగిని ఆయన పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment