సీలింగ్ స్థలంలో
● నలుగురు తహసీల్దార్లు కాదన్నారు! ● ముడుపులు పుచ్చుకుని ఓకే చేసిన ప్రస్తుత తహసీల్దార్ ● అధికారికి కూటమి ప్రజాప్రతినిధి అండ ● 15 ఎకరాలు కట్టబెట్టేందుకు స్కెచ్
అడిగేవారు లేరని.. అడ్డుకునేవారు రారని.. సీలింగ్ భూములను ఆక్రమించారు. వాటిని కొనుగోలు చేసినట్టు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి..సొంతం చేసుకుని, కంచె వేసి, జామాయిల్ సాగు చేశారు. ఈ తతంగమంతా దశాబ్దాల కిందట జరిగింది. ఇందుకు పాసు పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులకు ముడుపుల ఆశ చూపారు. సీలింగ్ భూములకు పాసుపుస్తకాలు జారీ చేయకూడదన్న నిబంధనలతో నలుగురు తహసీల్దార్లు తోసిపుచ్చారు. వాటిని తోసిరాజని పని కానిచ్చేశారు ప్రస్తుత రెవెన్యూ అధికారులు. ఇదీ చిల్లకూరు మండలంలోని బూదనం టోల్ ప్లాజా సమీపంలోని సీలింగ్ భూముల కథ.
జాతీయ రహదారి పక్కనే ఉన్న సీలింగ్ భూములకు ఫెన్సింగ్ వేసి సాగు చేసిన జామాయిల్
సాక్షి టాస్క్‌ఫోర్సు: చైన్నె– కోల్‌కత్తా జాతీయ రహదారి వెంబడి తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో భూములు రూ.కోట్లు పలుకుతున్నాయి. ఇక్కడ పట్టా భూములు తక్కువగా ఉండగా ఎక్కువ భాగం ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటి ధరలు రూ.కోట్ల లో పలుకుతున్నాయి. వీటిపై కన్నెసిన కొంతమంది వాటిని సొంతం చేసుకునేందుకు బరి తెగిస్తున్నారు. ఇందులో భాగంగానే కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను సొంతం చేసుకునేందుకు అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు చెల్లిస్తున్నారు. దీనికి అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది.
కడివేడు రెవెన్యూలో..
జాతీయ రహదారి పక్కనే బూదనం టోల్ ప్లాజాకు సమీపంలో ఉన్న సర్వే నంబర్ 876లో 192 ఎకరాల భూమిని సీలింగ్ చట్టం వచ్చిన తరువాత యజమానులు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇందులో 15 ఎకరాల భూమిని 1998లో కొనుగోలు చేసినట్లు తప్పడు పత్రాలతో గూడూరుకు చెందిన ఓ కుటుంబం సొంతం చేసుకునేందుకు సిద్ధం అ య్యింది. అప్పట్లో ఉన్న తహసీల్దార్ల వద్దకు కొనుగోలు పత్రాలను తీసుకుని వెళ్లి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేయాలని కోరగా తిరష్కరించా రు. దీంతో అప్పట్లో ఇద్దరు తహసీల్దార్లు వీరికి ససేమిరా అనడంతో మరోసారి 2017లో అప్పటి తహసీల్దార్ రమణయ్యను పాసుపుస్తకాలు ఇవ్వా లని కోరారు. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, సీలింగ్ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని చెప్పారు. అటు తరువాత మరోసారి 2022లో తహసీల్దార్‌గా పని చేసిన స్వర్ణ వద్ద పాసుప్తుకాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆమె రికార్డులు పరిశీలించి అన్‌రిజిస్టర్డ్ అగ్రిమెంటు కావడంతో పట్టాదారుల పాస్ పుస్తకాలు ఇవ్వడం కుదరదని 30 రోజుల్లో గూడూరు ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. అయితే భూమిని ఆక్రమించుకున్న వారు ఇక వీటి విషయం పట్టించుకోకుండా ఉండి పోయారు. ఈ క్రమంలోనే ఏడాది తరువాత చిల్లకూరు తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులతో పనులు చక్కబెట్టుకునే క్రమంలో భారీస్థాయిలో ముడుపులు అందించి, తహసీల్దార్ స్వర్ణ ఇచ్చిన ఉత్తర్వులపై ఆర్డీఓ కిరణ్‌కుమార్ వద్దకు అప్పీల్‌కు వెళ్లారు. అయితే అప్పీల్ విచారణను అప్పటికే ప్రభుత్వం డీఆర్‌ఓకు ఇచ్చి ఉన్నారు. అయినా ఆర్డీఓ కొత్తగా రాత పూర్వక ఆదేశాలు జారీ చేస్తూ చిల్లకూరు తహసీల్దార్‌ను పనులు చక్క బెట్టమన్నారు. దీంతో ఆయన భారీస్థాయిలో ముడుపులు అందుకుని, పనులు పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు.
అందరూ కీలకమే
సీలింగ్ భూములను కట్టబెట్టడంలో భారీస్థాయిలో ముడుపులు అందడంతో పాటు అధికార పార్టీ పెద్దలు భరోసా ఇవ్వడంతో కింద స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు కీలకంగా పని చేశారు. గతంలో ఇదే రెవెన్యూలో పని చేసిన వీఆర్వో బాలాజీ అప్పట్లో ఇక్కడ భూములు సీలింగ్ లేదని, రాత పూర్వకంగా నివేదికలు ఇచ్చి ఉన్నారు. ప్రస్తుతం మరోసారి కడివేడు రెవెన్యూలోనే విధులు నిర్వహిస్తున్న వీఆర్వో సీలింగ్ భూములు ఆక్రమించుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రాసి నివేదికలు ఇవ్వడం విశేషం. దీన్ని ఆర్‌ఐగా పనిచేస్తున్న యువతికి ఇవ్వగా ఆమె ఆ నివేదికలను తిరష్కరించడంతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఆమె ఒక నెల పాటు సెలవు పెట్టుకుని ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లి పోయారు. ఆ తరువాత ఆ ఫైల్‌పై నేరుగా తహసీల్దార్ సంతకం చేసి, ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోనే గూడూరు ఆర్డీఓగా పని చేసిన కిరణ్‌కుమార్ కూడా వీరికి అండగా నిలవడంతోనే పనులు సాగినట్లు సమాచారం.
ఎక్కడ పని చేసినా ధనార్జనే ధ్యేయం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేసిన శ్రీనివాసులు, తహసీల్దార్లు లేని కార్యా లయాల్లో పోస్టింగ్ వేయించుకుని ఎఫ్‌ఏసీగా పని చేస్తూ ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు భారీస్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అందులో జిల్లా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
అధికార పార్టీ అండతోనే..
ప్రభుత్వం మారిన తరువాత జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా తహసీల్దార్ శ్రీనివాసులకు చిల్లకూరు మండలం నుంచి బదిలీ ఆదేశాలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వారికి పనులు చేసేందుకు నమ్మకస్తుడు కావాల్సి ఉండడంతో ఈయనను ఎంపిక చేసుకున్నారు. దీంతో నాలుగు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు బాస్‌గా వ్యవహరించే వ్యక్తితో పాటుగా స్థానిక ప్రజా ప్రతినిధి పూర్తి అండదండలతో చిల్లకూరు మండలంలోనే కొనసాగుతున్నారు. ఇందుకు గాను వారితో పాటుగా వారి అనుచరులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయమై గూడూరు సబ్ కలెక్టర్‌ను ఫోన్‌లో వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment