వైకుంఠ ఏకాదశికి ముమ్మర ఏర్పాట్లు
● సమీక్ష నిర్వహించిన చెవిరెడ్డి ● స్వాగత తోరణాలు, విద్యుద్దీపాల ఏర్పాట్లపై సూచనలు
తిరుపతి రూరల్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తుమ్మలగుంట కల్యాణ వెంకన్న ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. ఈ నెల 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై గురువారం ఈవో, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 3.30 గంటల నుంచే వైకుంఠ ద్వారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రధాన ఆలయ ముఖద్వారంతో పాటు వైకుంఠ ద్వారాన్ని సువాసనలు వెదజల్లే పరిమళ భరిత పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించాలన్నా రు. ఇందుకోసం దేశ, విదేశాల నుంచి పుష్పాలు తీసుకువచ్చేలా చూడాలని ఆలయ సిబ్బందికి సూచించారు. ఆలయం ముందు సర్వదర్శనానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు ఆగకుండా ముందుకు కదులుతూ ఉండేలా చూడాలన్నారు. వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ గుండా అనుమతించి సామాన్య భక్తులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా గోవిందమాల ధరించిన భక్తులకు స్వామి దర్శనం ఆలస్యం కాకుండా చూడాలన్నారు. తుమ్మలగుంట గ్రామ శివార్లలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గ్రామస్తులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిరంతరాయంగా అన్న ప్రసాదాల పంపిణీ
వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment