తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 6వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు శ్రీఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు వేడుకగా జరుగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం శ్రీగోవిందరాజస్వామి వారు పల్లకీలో ఊరేగింపుగా శ్రీరామచంద్రపుష్కరిణి కట్టపైకి వేంచేపు చేశారు.
ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వామివారు ముందుగా ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నుంచి ఆరంభం కానున్న నీరాటోత్సవాలలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు శ్రీఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి గోవిందరాజస్వామి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల మీదుగా రామచంద్ర కట్టపైనున్న నీరాట మండపానికి చేరుకుంటారు.
అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం నిర్వహిస్తారు. ఆండాళ్ అమ్మవారు స్వామి వారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహించనున్నట్టు టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణ, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment