కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి బలం
సత్యవేడు/వరదయ్యపాళెం: అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కూటమి ప్రభుత్వానికి చెందిన 164 మంది ఎమ్మెల్యేలు దారి దోపిడీదారులుగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలే ధ్యేయంగా వార్తల్లోకి ఎక్కుతున్నారని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సత్యవేడులో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల సమూహమే బలం అని.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిఒక్కరూ అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముందుగా ఆయన, తిరుపతి ఎంపీ గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేష్, పార్టీ నాయకులతో కలసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ అధికారం లేకున్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కూటమి నాయకులు దాడులు చేసి తప్పుడు కేసులు బనాయించినా, మనోధైర్యంతో ఉత్సాహంతో ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు తాను ఎళ్లవేళలా అండగా ఉంటానన్నారు. ప్రపంచ దేశాలతో మన తెలుగు పిల్లలు పోటీ పడాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ తప్పనిసరి చేస్తే ఆ నిర్ణయాన్ని కూడా చంద్రబాబుకు వంతపాడే కుహనా మేధావులు అడ్డుకున్నారని ఆరోపించారు. 6 నెలలకే 3 పార్టీలు కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
అవినీతిపై వాళ్ల పత్రికలే రాస్తున్నాయి..
ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని తిరుపతి ఇన్‌చార్జ్ మంత్రి లీలల గురించి.. హోమంత్రి పీఏపై ఆరోపణల గురించి వాళ్ల అనుకూల పేపర్లే రాశాయి. 164 మంది ఎమ్మెల్యేలు దారిదోపిడీ దొంగల కంటే దారుణంగా తయారయ్యారని.. వాళ్లను కంట్రోల్ చేయమని రాస్తున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 3.5 కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా సాయం చేస్తే.. గత ఎన్నికలప్పుడు తాము అంతకన్నా ఎక్కువగా చేస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..
సత్యవేడులో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని నూకతోటి రాజేష్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, మాట ఇస్తే తప్పేవారు కాదని, తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తన తల్లి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి రాజకీయంగా పైకి తెచ్చారన్నారు. సత్యవేడులో మూడుసార్లు పార్టీ గెలిచింది. భూమన కరుణాకర రెడ్డి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఆయన అడుగుజాడల్లో నడుద్దామన్నారు. ఎంపీ గురుమూర్తి కార్యకర్తల కోసం పోరాడే వ్యక్తి అని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే.సుశీల్ కుమార్ రెడ్డి, నాయకులు అపరంజిరాజు, దయాకర్ రెడ్డి, గవర్ల కృష్ణయ్య, చలపతి రాజు, సొరకాయలు, బీరేంద్రవర్మ, మాధవీలత, రాకేష్, చంద్రశేఖర్ రెడ్డి, కేవీ నిరంజన్ రెడ్డి, రమే ష్, మస్తానీ, చిన్నదొరై, శ్యాం, మహేష్, దామోదర్‌రెడ్డి, బొప్పన తిలక్, సురేష్, వినోద్, దివాకర్ రెడ్డి, అన్నాదొరై, ఉజ్వల్ రెడ్డి, కిరణ్ సాయి, నందగోపాల్, లాల్ బాబుయాదవ్, ధనుంజయరెడ్డి, హరిశ్చంద్ర రెడ్డి, రోస్ రెడ్డి, భాస్కర్ నాయుడు, తొప్పయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
దారి దోపిడీదారులుగా కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు
వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా, పరిపాలనాధక్షుడిగా చరిత్ర సృష్టించారు
సత్యవేడు ఆత్మీయ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన భూమన కరుణాకర రెడ్డి
గత ఐదేళ్లూ సంతోషంగా ఉన్నారు : ఎంపీ
జనన్న పాలనలో రాష్ట్రంలోని పేదలు ఐదేళ్లు సంతోషంగా ఉన్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారని, పిల్లల అభివృద్ధి కోసం ఆంగ్లమాధ్యమం తీసుకొచ్చారన్నారు. కేవలం దోచుకోవడానికే చాలామంది చంద్రబాబు వైపు ఉన్నారన్నారు. రూ.1.20 వేల కోట్లు అప్పు చేసి, విద్యుత్‌చార్జీలు పెంచి, పన్నులు వేస్తూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని, వీరికి ప్రజలే ప్రజాకోర్టులో శిక్ష వేస్తారన్నారు. 17–19 ఏళ్ల వయసులోనే కరుణాకరరెడ్డి దాదాపు 10వేల మందితో అధిక ధరలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. మనమంతా ఆయన అడుగులో అడుగు వేసి మళ్లీ జగన్‌మోహన్ రెడ్డిని సీఎంగా, సత్యవేడులో రాజేష్‌ను గెలిపించుకుందాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment