కూటమి నేతల అత్యుత్సాహం
కేవీబీపురం (వరదయ్యపాళెం): మండల కేంద్రమైన కేవీబీపురం పరిధిలోని కొత్తకాలనీలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో కూటమి నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సీసీ రోడ్డు నిర్మాణానికి ఒత్తిడి చేస్తున్నారు. ఆ దిశగా సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అక్కడకు చేర్చడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ కరపారెడ్డి గిరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు వీరాపురం అయ్యప్ప స్థానికులతో కలిసి గురువారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొత్తకాలనీ పరిధిలోని సర్వే నంబర్ 53లో 2008లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. తాజాగా గత ప్రభుత్వంలో మరికొందరి నిరుపేదలకు అదే ప్రాంతంలో ఇళ్ల పట్టాలను జారీ చేసింది. అయితే పట్టాలు పొందిన పేదలు ఇళ్ల నిర్మాణానికి సిద్ధం కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా ఇళ్లు నిర్మించకూడదని కోర్టును ఆశ్రయించి కుట్ర చేశారు. ఆ సమయంలో కోర్టు స్టే విధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పునిచ్చింది. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఓ కూటమి నేత సీసీ రోడ్డు నిర్మాణానికి కొద్దిరోజులుగా తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని స్థానికులు రెవెన్యూ వారికి ఫిర్యాదు చేశారు. చాలా కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుంటే అభ్యంతరం వ్యక్తం చేసిన కూటమి నేతలు రోడ్డు ఎలా నిర్మిస్తారని, అదే జరిగితే తాము అడ్డుకోవడం ఖాయమని రెవెన్యూ వారికి తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ మునిరత్నం కోర్టు వివాదంలో ఉన్న భూమిలో రోడ్డు పనులు చేపట్టవద్దని, అలా చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని వారిని హెచ్చరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment