● ఆరు నెలలుగా కార్యకర్తలు తీవ్ర నిరాశతో ఉన్నారు ● ఎమ్మెల్యే నాని కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కుమార్‌రాజారెడ్డి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: మీకోసం ఎంతో మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు పనిచేశారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర నిరాశతో ఉన్నారు. మీరు కార్యకర్తలను కూడా గుర్తించాలంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, సీఎం చంద్రబాబుకు అత్యతం సన్నిహితుడు కుమార్‌రాజారెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నానికి సూచించడం హాట్ టాపిక్‌గా మారింది. శనివారం చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు కుమార్ రాజారెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరిలో టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారన్నారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర నిరాశలోకి కూరుకుపోయారంటూ సభాసాక్షిగా ఆయన తెలిపారు. గత ఆరు నెలలుగా కార్యకర్తలు మిమల్ని కలవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మీకోసం..మీ వెంట నడిచిన కార్యకర్తలను కాస్త గుర్తించాలంటూ ఆయన ఎమ్మెల్యే నానిని కోరారు. వెంటనే ఎమ్మెల్యే నాని.. ఈ కార్యక్రమంలో రాజకీయాల గురించి వద్దని, తర్వాత చూసుకుందామంటూ ఆయనకు తెలిపారు.
తమ్ముళ్లలో చర్చకు లేపిన కామెంట్స్
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో ముందున్నంత జోష్ కనిపించడం లేదన్నమాటకు శనివారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు చేసిన కామెంట్స్‌కు బలం చేకూరుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పనిచేసిన నాటి నుంచి కుమార్ రాజారెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. చంద్రగిరిలోని సీఎంకు సన్నిహితుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. సీనియర్ నేత అయిన ఆయన, టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే నాని పట్టించుకోవడం లేదన్న అర్థంలో మాట్లాడటంపై ఆ పార్టీ తమ్ముళ్లు బహిరంగంగా కాకున్నా..లోలోపల తీవ్ర స్థాయిలో చర్చింకుంటున్నట్లు సమాచారం. ఆరు నెలల్లో పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే నాని సరైన గుర్తింపు ఇవ్వలేదని, తనకు ఆదాయం సమకూర్చే వాళ్లను తప్ప, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదంటూ చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లకు తమ ఆవేదనను వేదిక సాక్షిగా ఎమ్మెల్యే సమక్షంలో కుమార్ రాజారెడ్డి చెప్పడంపై, మా అందరిలోని మాటను, అందరూ ఉన్నప్పుడే వ్యక్తం చేయడంతో అక్కడి వారు చర్చించుకోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment