ఈత రాక.. ఊపిరాడక!
● విహారంలో విషాదం ● జలపాతంలో దిగి దత్తసాయి మృతి ● సురక్షితంగా బయపడిన మరో ఐదుగురు యువకులు
శ్రీకాళహస్తి: విహారంలో విషాదం నెలకొంది. శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు యువకులు రైల్వే కోడూరు సమీపంలోని గుంజనేరు జలపాతం వద్దకు శుక్రవారం వెళ్లారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. బంధువులు, స్థానికుల వివరాలు.. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తికి చెందిన దినేష్, గిరి, కేదార్, పీ.దినేష్, మోహన్, దత్తసాయి(25) అనే ఆరుగురు యువకులు విహార యాత్రకని గుంజనేరు జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా ఈతకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిలో ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారికెవ్వరికీ ఈత రాదు. ఈ క్రమంలో దత్తసాయి లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ఊపిరాడక సాయంత్రం 3.30గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుని స్నేహితులు దత్తసాయి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వారు రైల్వే కోడూరు, రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత బంధువులు, అటవీశాఖ అధికారులు, పోలీసులు కలిసి కోడూరు రైల్వేస్టేషన్‌కు 15 కిలోమీటర్ల దూరంలో శేషాచలం అడవుల్లో గల జలపాతం వద్దకు అర్ధరాత్రి 12 గంటలకు చేరుకున్నారు. ఆ తర్వాత వేకువ జాము రెండు గంటల ప్రాంతంలో దత్తసాయి మృతదేహాన్ని అటవిశాఖ జీపులో కోడూరుకి తీసుకొచ్చారు. కోడూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శ్రీకాళహస్తికి తరలించారు. ఐదుగురు యువకులను రైల్వే కోడూరు పోలీసులు విచారిస్తున్నారు.
శివయ్య చెంత అలరిస్తూ..డ్రమ్స్ వాయిస్తూ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతిరోజూ జరిగే ఏకాంతసేవలో ఆలయం వెలుపల శివయ్యకు నేరుగా గల నంది విగ్రహం వద్ద తన మిత్రులతో కలిసి దత్తసాయి డ్రమ్స్ వాయించేవాడు. అలాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాల్లో నాలుగు మాడవీధుల్లో డ్రమ్స్ వాయిస్తూ భక్తులను ఆకట్టుకునేవారు. అతని మృతికి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, పూజారులు విచారం వ్యక్తం చేశారు.
ఒక్కడే కొడుకు
దత్తసాయి తండ్రి ఈశ్వరరెడ్డి చిరుద్యోగి. తల్లి ఓ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వారికి కుమార్తె, కుమారుడు దత్తసాయి ఉన్నారు. కుమార్తె బీటెక్ చదువుతుండగా.. పెద్దవాడైన దత్తసాయి ఓపెన్ డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు దూరమవడంతో కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment