స్టెమ్ ల్యాబ్ ఏర్పాటు
రేణిగుంట(ఏర్పేడు): బ్రాడ్ కామ్ ఆర్థిక సహాయంతో బెంగళూరుకు చెందిన క్రైసంస్థ, ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం, పల్లం జెడ్పీ ఉన్నత పాఠశాల, శ్రీకాళహస్తి మండలం, ముచ్చివోలు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సోమవారం స్టెమ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. పిల్లల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, గణిత అంశాలపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసినట్టు ప్రగతి సంస్థ డైరెక్టర్ కేవీ రమణ తెలిపారు. ఈ పాఠశాలల్లో రూ.7 లక్షల విలువైన స్టెమ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పల్లం హెచ్‌ఎం తీగల ఆనంద్, ప్రగతి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
20 నుంచి సర్వే
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌తోపాటు, జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌తోపాటు పలువురు వైద్యుల చేతుల మీదుగా కుష్ఠు వ్యాధి సర్వేకు చెందిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా సర్వే చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా రోగులకు వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
మధ్యవర్తిత్వంపై అవగాహన
తిరుపతి లీగల్: రాష్ట్ర న్యాయ సేవ సంస్థ, ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థలు సంయుక్తంగా సోమవారం తిరుపతి శ్వేత భవనంలో రాయలసీమ జిల్లాలకు చెందిన 25 మంది న్యాయమూర్తులకు అధ్యవర్తిత్వంపై అవగాహన తరగతులును ప్రారంభించాయి. ఈ తరగతులను తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ తరగతులు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఢిల్లీకి చెందిన సీనియర్ ట్రైనీలు సుధీర్‌కుమార్ జైన్, నగీన జైన్ అవగాహన కల్పించనున్నారు. ఈ అవగాహన తరగతులు సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు జరగనున్నాయి. అవగాహన తరగతుల్లో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు చెందిన 25 మంది న్యాయమూర్తులు పాల్గొన్నారు.
హౌసింగ్ ఈఈ బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: నెల్లూరు జిల్లా హౌసింగ్ ఈఈ దయాకర్‌ను తిరుపతి జిల్లా ఈఈగా బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి వెంకటేశ్వర్లు రెండు నెలల క్రితం బదిలీపై విజయవాడకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుపతి డీఈగా పనిచేస్తున్న శ్రీనివాసులకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రె గ్యూలర్ అధికారిగా దయాకర్‌ను ఈఈగా జి ల్లాకు పంపారు. హౌసింగ్ విభాగానికి చెందిన పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
మహిళా ఓటర్లే అధికం
తిరుపతి అర్బన్: 2025 షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాను సోమవారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ విడుదల చేశారు. తిరుపతి జిల్లా ఓటర్లు 18,04,229 మందిగా ఉండగా.. అందులో సీ్త్రలు 9,25,735 మంది, పురుషులు 8,78,321, ఇతరులు 173 మంది ఉన్నట్టు తెలిపారు. అలాగే ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 295 మంది, సర్వీస్ ఓటర్లు 823 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 3,14,230 మంది కాగా, తిరుపతి పరిధిలో 2,96,531 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment