పారిశ్రామికవాడ.. ఏదీ రహదారుల జాడ
● అధ్వానంగా ఇండస్ట్రియల్ రోడ్లు ● పట్టించుకోని పరిశ్రమలశాఖ
శ్రీ కాళహస్తి రూరల్ (రేణిగుంట): నూతన కంపెనీలు, పరిశ్రమలను తీసుకురావడమేమో గానీ, పారిశ్రామికవాడలో ఉన్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమవుతున్నారు. రేణిగుంట మండలంలోని గాజులమండ్యం, రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో మొత్తం 100కు పైగా వివిధ రకాల పరిశ్రమలున్నాయి. ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరేలా ఎక్కువ పన్నులు చెల్లిస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ ఫ్యాక్టరీలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ అటువంటి ఆలోచన ఏడు నెలలుగా కూటమి ప్రభుత్వం చేయకపోవడం విడ్డూరంగా ఉంది. రోడ్లు బురదగుంతల్లా మారి ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఫ్యాక్టరీలకు వచ్చే భారీ వాహనాలు రాకపోకలు సాగించాలంటేనే వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాటిలో వర్షపునీరు చేరింది. కార్మికులు నిత్యం ఫ్యాక్టరీలకు వెళ్లి రావాలంటే ఆ గుంతల రోడ్డులే గతి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థపు నీరు వెళ్లేందుకు సరైన కాలవలు నిర్మించకపోవడం వల్ల ఆ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థపు నీరు ఫ్యాక్టరీల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలలో చేరి మురుగు గుంతలను తలపిస్తోంది. ఆ మురుగు గుంతలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోతున్నాయి. వర్షం వచ్చిందంటే ఈ మురుగు నీరంతా రోడ్డుపైకి రావడంతో కర్మాగారాలకు వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీఐఐసీ అధికారులు సమస్యల పైన దృష్టి పెట్టడం లేదని, కార్యాలయా లకే పరిమితం అవుతున్నారని విమర్శలున్నాయి. బయట రాష్ట్రాల నుంచి రహదారులను బాగుచేయాలని గళమెత్తలేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యాలున్నాయి. అధికారయంత్రాంగం స్పందించి ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో మౌలికసదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అధ్వాన్నంగా గాజులమండ్యం ఎస్టేట్‌లోని రహదార్లు
Comments
Please login to add a commentAdd a comment