ఉత్తీర్ణులకే ఉద్యోగోన్నతి
● ఆర్టీసీ డ్రైవర్లకు పరీక్షలు ● 100 మార్కులకు 40 మార్కులు వస్తేనే పాస్
తిరుపతి అర్బన్ : విద్యార్థులు పరీక్షలు రాసేది సాధారణం.. ఉద్యోగాల కోసం యువత పరీక్షలు రాయడం తెలిసిందే.. అయితే ఆర్టీసీలో ప్రమోషన్ కోసం డ్రైవర్లు ఎగ్జామ్ రాయాల్సి వస్తోంది. చిన్నపాటి ఉద్యోగోన్నతి పొందాలన్నా కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఆర్టీసీలో డ్రైవర్లకు ఉంది. ఈక్రమంలో 8వ తరగతి వరకు చదవని వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 508 మంది ఆర్టీసీ డ్రైవర్లు ఎగ్జామ్‌కు హాజరవుతున్నారు. వీరంతా 50 ఏళ్లు పైబడిన వారే కావడం విశేషం. ఈ పరీక్షలో ఉత్తీర్ణుమైన వారికే ఉద్యోగోన్నతి ఇవ్వనున్నారు.
పరీక్షలు ఇలా...
పరీక్షకు రెండు గంటల సమయం ఇచ్చారు. 100 మార్కులకు గాను 40 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు. నెల్లూరుకు చెందిన డిప్యూటీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పర్యవేక్షణలో బుధవారం తిరుపతి డీపీటీఓ కార్యాలయంలో పరీక్షలు ప్రారంభించారు. ఇన్విజిలేటర్‌గా జిల్లా పర్సనల్ ఆఫీసర్ సహజాద్ విధులు నిర్వర్తించారు. రోజుకు 50 నుంచి 60 మందికి పరీక్షలు నిర్వహించేలా డ్రైవర్లుకు టైమ్ టేబుల్ ఇచ్చేశారు. వారం, పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి.
చూసి రాయడమే..
పరీక్ష అంటే అందులో ప్రశ్నలు ఇస్తే.. డ్రైవర్లు జవాబులు రాయాల్సిన పనిలేదు. కేవలం పది పేజీల బుక్‌లెట్‌ను అందిస్తారు. అందులో ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవర్లు పాటించాల్సిన అంశాలు ఉంటాయి. డ్రైవర్లకు ఇచ్చే బుక్‌లెట్‌లో రెండు గంటల లోపు ట్రాఫిక్ రూల్స్‌ను చూసి రాసి ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment