‘జనశక్తి–మనశక్తి’ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
తిరుపతి అర్బన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా తిరుపతికి చెందిన కాపిరెడ్డి కృష్ణారెడ్డి రచించిన జనశక్తి–మనశక్తి పుస్తకాన్ని బుధవారం తాడేపల్లె క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అవర్ స్టేట్–అవర్ లీడర్ సోషల్ మీడియా మెంబర్స్ ఆధ్వర్యంలో కాపిరెడ్డి కృష్ణారెడ్డి, ఆయన సతీమణి శాంతమూర్తి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సుపరిపాలన విధానాలను పద్యరూపంలో వివరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సత్కరించినట్లు తెలిపారు.
ఉపాధిలో అవకతవకలు
● ఆరుగురి సస్పెన్షన్
దొరవారిసత్రం : ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు టీఏలు, ముగ్గురు ఎఫ్‌ఏలు, జేఈపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులను పీడీ శ్రీనివాసప్రసాద్ జారీ చేశారు. అలాగే ఉపాధి సిబ్బంది నుంచి రూ.7.75లక్షలు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ,97వేలు రికవరీ చేయాలని పేర్కొన్నారు. ఇటీవల దొరవారిసత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పనులపై నిర్వహించిన 17వ సామాజిక తనిఖీలో సిబ్బంది అవినీతి వెలుగుచూసింది. ఈ మేరకు టీఏలు షమ్మీఉద్దీన్, కోటేశ్వరయ్య, జేఈ మునీంద్రతోపాటు ఆనేపూడి, తల్లంపాడు, ఏకొల్లు ఏఫ్‌ఏలపై వేటు పడింది. ఈ ఇద్దరు టీఏల అక్రమాలు గత ఏడాది నిర్వహించిన 16వ సామాజిక తనిఖీలో కూడా బయటపడి సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం.
రుయా అభివృద్ధికి చర్యలు
తిరుపతి తుడా : రుయా ఆస్పత్రి అభివృద్ధికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం ఎస్వీ వైద్య కళాశాలలో రుయా అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని, ఈ మేరకు ఆస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. సూపరింటెండెంట్ రవి ప్రభు మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యలనువివరించారు. అనంతరం అజెండా అంశాలను నివేదించారు. ఈ క్రమంలో రుయా ఆస్పత్రికి అవసరమైన పరికరాల కొనుగోలు, వివిధ విభాగాల్లో మరమ్మతులకు అవసరమైన రూ.20.85లక్షల మంజూరుకు ఆమోదం తెలిపారు. అలాగే హెచ్‌డీఎస్ కమిటీ కోసం మరో ఇద్దరు సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యంతోనే ఉత్తమ భవిత
తిరుపతి సిటీ : విద్యార్థులు ఉన్నత లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేస్తేనే ఉత్తమ భవిత సాధ్యమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నిర్వహించిన ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. పిల్లలను ప్రోత్సహించేందుకు పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్‌వ్ మాట్లాడుతూ తిరుపతిలో ఇంటర్ నుంచి పీజీ వరకు ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి ప్రతిభా అవార్డులు అందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి శ్రీధర్, వర్సిటీ అధ్యక్షుడు మల్చి ఉపేంద్ర, ఉపాధ్యక్షుడు శ్రీను, నగర అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment