‘సుకన్యా సమృద్ధి’ మేళా రేపు
తిరుపతి సిటీ : డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈనెల 24వ తేదీన సుకన్యా సమృద్ధి యోజన మేళా నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ బి.నరసప్ప తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జాతీయ బాలికాదినోత్సవాన్ని పురస్కరించుకుని సుకన్యా పథకం కింద ఖాతాలు తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేళాలో 5వేల ఖాతాలు ప్రారంభించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. 10 ఏళ్లలోపు బాలికలు సుకన్య పథకం కింద ఖాతా తెరిస్తే, 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్యకోసం ఉన్న మొత్తంలో 50శాతం నగదు తీసుకోవచ్చని వివరించారు. వివాహానికి నెల ముందుగానీ, వివాహనంతరం మూడు నెలలోపు పథకంలోని మొత్తం నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. ఈ ఖాతా కింద ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50లక్షల వరకు చెల్లించవచ్చని వెల్లడించారు. వివరాలకు సమీపంలోని పోస్టాఫీసులో సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 7 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 60,581 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 19,228 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.04 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు 7 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
పరిశోధనలతో అద్భుత ఫలితాలు
చంద్రగిరి : పరిశోధనలను మహాయజ్ఞంలా భావించి చేపడితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని సింగపూర్ నవ్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ సుందరరాజన్ తెలిపారు. మోహన్‌బాబు యూనివర్సిటీలో 2024–25 ఐదో బ్యాచ్ పరిశోధక విద్యార్థులకు రీసెర్చ్ మెథడాలజీ, పబ్లికేషన్ ఎథిక్స్ అనే అంశాలపై మూడురోజుల వర్క్‌షాప్‌ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సుందరరాజన్‌తోపాటు మైసూర్ జేఎస్‌ఎస్ సైన్స్, టెక్నాలజీ ప్రొఫసర్ మహానంద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎంబీయూ లైబ్రరీలో విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైన విజ్ఞానం ఉందన్నారు. ఎంబీయూ రీసెర్చ్, ఇన్నోవేషన్ డీన్ శ్రీనివాసులు మాట్లాడుతూ వర్సిటీ స్థాపించిన మూడేళ్లలోనే 500 మందికి పైగా పరిశోధక విద్యార్థులు పేర్లు రిజిస్టరు చేసుకోవడం గొప్ప పరిణామమని వెల్లడించారు. పరిశోధక విద్యార్థులకు అవసరమైన సలహాలు అందించేందుకు పర్యవేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రో వోస్ట్ డాక్టర్ నాగరాజ రామారావు, వీసీ కరుణాకరన్, రిజిస్ట్రార్ సారథి పాల్గొన్నారు.
చెంగాళమ్మకు
వెండి సామగ్రి సమర్పణ
సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి పట్టణానికి చెందిన ఇమ్మానేని సత్యనారాయణ,బాబామని, ఇమ్మానేని చంద్రశేఖర్‌రావు,చంద్రమతి దంపతులు 6.4 కిలోల వెండి వస్తువులను సమర్పించారు. బుధవారం ఈ మేరకు ఆలయ సహాయ కమిషనర్ బి.ప్రసన్నలక్ష్మికి అందజేశారు.సుమారు రూ.7.50 లక్షల విలువైన రెండు వెండి గంగాళాలు, ఒక వెండి దివిటీ అందించినట్లు దాతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment