రైల్వే భూమి... అయితే ఏంటి!
● సీఎం చంద్రబాబు బంధువునంటూ టీడీపీ నేత వీరంగం ● రూ.50 కోట్ల స్థలం స్వాహాకు యత్నం
తిరుపతి టాస్క్‌ఫోర్స్ : ‘‘ సీఎం చంద్రబాబు బంధువుని.. స్టేట్ అయినా సెంట్రల్ అయినా మాదే అధికారం.. రైల్వే భూమి అయితే ఏంటి.. అది నాదే’’ అంటూ ఓ టీడీపీ నేత వీరంగం చేశాడు. అటు రైల్వే అధికారులు.. ఇటు రెవెన్యూ సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశాడు. వివరాలు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 609లో 60 ఎకరాల రైల్వే భూమి ఉంది. అందులోని ఐదు ఎకరాల్లో రైల్వే శాఖ తరఫున కల్యాణ మండపం నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం రూ.3కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు గురువారం భూమి పూజ చేసేందుకు బుధవారం ఆ స్థలంలో ముళ్ల పొదలు తొలగింపజేశారు. అయితే చంద్రగిరి మండలానికి చెందిన టీడీపీ నేత ఒకరు అక్కడకు చేరుకుని ఆ భూమిలో 5 ఎకరాలు నాది అంటూ రైల్వే అధికారులను అడ్డుకున్నారు. భూమి పూజ పనులను నిలిపివేయించారు. దీంతో రెల్వే అధికారులు వెంటనే రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులకు సైతం విషయం తెలియజేశారు. అయితే సదరు టీడీపీ నేత తాను సీఎం బంధువు అని చెప్పడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. టీడీపీ నేత తనదంటున్న భూమి విలువ సుమారు రూ.50కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment