సామాన్య భక్తులకే ప్రాధాన్యం
శ్రీకాళహస్తి : సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామని, అరగంటలో దర్శనం చేయిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాళహస్తీశ్వరాలయ పరిపాలన భవనంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో జరిగిన ఘటనలు శ్రీకాళహస్తిలో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. భక్తులందరినీ వీఐపీలుగా భావించి త్వరితగతిన దర్శనం చేయించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన మరో పర్యాయం సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, పలువురు మంత్రులు సైతం హాజరవుతారని వెల్లడించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల్లో కూటమి నేతలు ఎవరూ పెత్తనం చేయరని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఓ బాపిరెడ్డి, ఆర్‌డీఓ భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment