రుయాలో దుకాణాల వివాదం
తిరుపతి తుడా : తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలోని దుకాణాల వివాదం ముదురుతోంది. ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఒక్కో దుకాణం రూ.లక్షలు పలికాయి. ఆశావహులు పోటీపడి సీల్డ్ కవర్లలో భారీ మొత్తానికి టెండర్ దక్కించుకున్నారు. ఓ దుకాణానికి గతంలో రూ.3వేలు అద్దె ఉండగా ఈ పర్యాయం రూ.1.6లక్షలు పలికింది. ఈ విధంగా ప్రతి షాపునకూ ఊహించని స్థాయిలో అద్దె ధర నమోదైంది. ఈ స్థాయిలో అద్దెలు చెల్లించి రోగులకు నాణ్యమైన తినుబండారాలను సరసమైన ధరలకు ఎలా విక్రయిస్తారంటూ పలువురు విమర్శిస్తున్నారు. పేదల ఆస్పత్రిలో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తే రోగుల పరిస్థితి ఏంటి అంటూ నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై పలు ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రుయా పరిపాలన భవనం వద్ద అవుట్ పోస్టుకు సమీపంలో గిరిజన కార్పొరేషన్ తరఫున దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు కొత్తగా అనుమతి ఇచ్చారు. ఈ షాపునకు అధికారులు నామినేషన్ విధానంలో కేవలం రూ. 22వేలు మాత్రమే అద్దె నిర్ణయించారు. పక్కనే ఉన్న జిరాక్స్, టీ షాపునకు రూ.1.6 రెంట్ చెల్లిస్తున్నారు. తక్కువ అద్దెతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న షాపు వల్ల తాము పూర్తిగా నష్టపోతామని దుకాణదారులు లబోదిబోమంటున్నారు. అధికారుల ఉదాసీనతే తమకు శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దుకాణాలు వద్దే మరో షాపునకు అనుమతి ఇవ్వడం అన్యాయమని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆ షాపును మరో చోటుకు మార్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభును వివరణ కోరగా కొత్త దుకాణం ఏర్పాటుపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయని, వాటిని పరిశీలించి ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment