‘భూమాత’.. ఎప్పటికో రాక! | - | Sakshi
Sakshi News home page

‘భూమాత’.. ఎప్పటికో రాక!

Published Mon, Oct 28 2024 8:41 AM | Last Updated on Mon, Oct 28 2024 8:41 AM

‘భూమాత’.. ఎప్పటికో రాక!

‘భూమాత’.. ఎప్పటికో రాక!

యాచారం: భూమాత ఎప్పుడొస్తావమ్మా.. అంటూ రైతులు కంటికికాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారు. యాచారం–కందుకూరు మండలాల సరిహద్దులోని ఫార్మాసిటీకి సేకరించిన భూమిలో రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి సంకల్పించడం తెలిసిందే. దీంతో యాచారం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, కడ్తాల్‌, ఆమనగల్లు, మహేశ్వరం తదితర మండలాల్లోని అనేక గ్రామాల్లో వ్యవసాయ భూములకు భలే డిమాండ్‌ వచ్చింది. ఈ క్రమంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ భూ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మీ సేవల్లో రూ.వేలాది ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నా లాగిన్లలో రెవెన్యూ అధికారులు సరైన ధ్రువీకరణ పత్రాలు లేవని రిజక్ట్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఆయా మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారుల నుంచి సరైన సమాధానమే ఉండడం లేదని వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం డబ్బుల్లేక రైతులు తమ వ్యవసాయ భూములను విక్రయించుకున్న దాఖలాలు సైతం ఉన్నాయి.

రిజక్ట్‌పై సమాచారం కరువు

యాచారం మండలంలోని 24 గ్రామాల్లో ధరణి పోర్టల్‌లో 2,550 భూ సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో టీఎం–33 మ్యాడుళ్ల కింద 1,557, వివిధ రకాల మ్యాడుళ్ల కింద 993 సమస్యలు ఉన్నట్లు తేల్చారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు మీ సేవల్లో రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు సరైన ధ్రువీకరణ, రికార్డులు లేవనే సాకుతో ఇష్టానుసారంగా రిజక్ట్‌ చేశారు. మొత్తం 2,550 దరఖాస్తుల్లో 1,800కు పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఎందుకు రిజక్ట్‌ చేస్తున్నారనే విషయమై దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాచారం (దరఖాస్తులో పేర్కొన్న ఫోను నంబరుకు) అందించాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం అవేవీ పాటించడం లేదు.

భూమాతపైనే ఆశలు

ధరణి పోర్టల్‌లోని నిబంధనలతో రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ భూమాతను తేవాలని చూస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలు ఇంకా ఖరారు కానప్పటికీ ఆయా మండలాల్లోని తహసీల్దార్లు మాత్రం త్వరలో భూమాత వస్తుంది, మీ సమస్యలు త్వరగా పరిష్కరమయ్యే అవకాశం ఉందని చెబుతూ కార్యాలయాలకు వచ్చే రైతులను తిరిగి పంపిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కారం కాక.. పట్టాదారు, పాసుపుస్తకాలు రాక రైతులు బ్యాంకు రుణాలు, రైతుబంధు, ఇతర ప్రయోజనాలు పొందక తీవ్రంగా నష్టపోయారు. దీంతో కాంగ్రెస్‌ సర్కార్‌ తీసుకువచ్చే భూమాత కోసం నిరీక్షిస్తున్నారు.

పెండింగ్‌లో భూ సమస్యలు

ధరణి పోర్టల్‌తో దొరకని పరిష్కారం

ఇష్టానుసారంగా రిజక్ట్‌ చేస్తున్న

రెవెన్యూ అధికారులు

తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

కాంగ్రెస్‌ సర్కార్‌ తెచ్చే ‘భూమాత’ కోసం ఎదురుచూపులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement