మా పోరాటానికి మద్దతివ్వండి
సీపీఐ నేత కూనంనేని కోరిన ఫార్మా భూ బాధితులు
దుద్యాల్: మండలంలోని ఫార్మా భూ బాధితులు బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఈ మేరకు నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేనికి వినతిపత్రం అందించారు. అనంతరం ఫార్మా బాధితులు మాట్లాడుతూ.. దుద్యాల్ మండలం లగచెర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,375 ఎకరాల భూమి ని సేకరిస్తోందని తెలిపారు. గిరిజనులు బతుకుతున్న పచ్చని పొలాల్లో విషం చిమ్మే ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సిద్ధమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని ఆందోళనలు చేస్తున్నా సర్కారు మాత్రం వెనక్కి తగ్గడం లేదని నిట్టూర్చారు. ఎంతో మంది పేదలు, కార్మిక, కర్షకులకు అండగా నిలిచిన సీపీఐ మద్దతు కోరుతున్నామని స్పష్టంచేశారు. ఈ విషయమై కూనంనేని స్పందిస్తూ.. పేదలకు అన్యాయం జరగనివ్వబోమని, బాధితుల పక్షాన నిలబడి పోరాడుతామని స్పష్టంచేశారు. ఫార్మా రద్దు విషయాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి సభ్యులు గోపాల్‌నాయక్, సురేశ్‌రాజ్, నారాయణ, హన్మంతు, మల్లేశ్, నర్సయ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment