కుటుంబాలు
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సర్వే కోసం సిబ్బందిని ఎంపిక చేసి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశాం. ఎప్పటికప్పుడు సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తాం. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం సర్వేను ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇందుకు ప్రజలు సహకరించాలి
– సుధీర్, అడిషనల్ కలెక్టర్
6నుంచి ఇంటింటి కుటుంబ సర్వే
వికారాబాద్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమానికి అధికారులు సిద్ధమవుతున్నారు. నవంబర్ 6నుంచి 18వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు నమోదు చేస్తారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా సర్వే ప్రక్రియ సాగనుంది. అలాగే ప్రస్తుతం జిల్లా జనాభా, కుటుంబాల సంఖ్య అంచనాల ప్రకారం సర్వే చేసేందుకు అధికారులు ప్లాన్ చేసుకుంటున్నారు. బుధవారంతో సర్వే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. నవంబర్ ఒకటి నుంచి 3వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు వారు సర్వే చేయాల్సిన ఇళ్లు, కుటుంబాల వివరాలను నమోదు చేసుకుంటారు. 5న సర్వే ఫారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 6నుంచి 18వ తేదీ వరకు సర్వే కొనసాగుతుంది. 19నుంచి 27వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు డాటా ఎంట్రీ చేయనున్నారు. 30న పూర్తిస్థాయి రిపోర్టు అందజేస్తారు.
2011 గణాంకాల ఆధారంగా..
ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ప్రకారం ఈ సర్వే చేయనున్నారు. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాలో 1,94,956 కుటుంబాలు, 9.27 లక్షల జనాభా ఉంది. నాలుగు మున్సిపాలిటీలు, 147 బ్లాకులు, 585 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, ఐకేపీ సీసీలు, వీఏఓలు సర్వే విధుల్లో పాల్గొననున్నారు. పది ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమిస్తారు. సర్వే పర్యవేక్షణ కోసం పది మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. వీరితో పాటు ఎంపీడీఓలు, ఎంపీఈఓలు, స్థానిక సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని స్థాయిల అధికారులు, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సర్వేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. రెండు ఫార్మెట్లలో పొందుపరిచిన ప్రశ్నావళి ఆధారంగా సమగ్ర వివరాలు నమోదు చేస్తారు.
ఉపాధ్యాయులు లేకుండానే..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని అధికారులు ఈసారి ఉపాధ్యాయులు లేకుండా నిర్వహించనున్నారు. టీచర్లను బోధనేతర పనులకు వినియోగించవద్దనే నిబంధనల నేపథ్యంలో విద్యాశాఖ వారిని మినహాయించి అందుబాటులో ఉన్న ఇతర శాఖల ఉద్యోగులతో సర్వే చేయించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో పలు రకాల ఆరోగ్య, కుటుంబ సర్వేలు, ఓటరు నమో దు కార్యక్రమాల్లో పాల్గొన్న వారు ఉండటంతో సర్వేకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. అయితే వయసు పైబడిన వారు, సంకేతికతను అందిపుచ్చుకోలేని వారు విధుల్లో పాల్గొననుండటంతో కొంత ఇబ్బంది ఏర్పడనుంది.
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
2011 జనాభా లెక్కల ప్రకారం ముందుకు..
పది ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్
శిక్షణ కార్యక్రమాలు పూర్తి
నవంబర్ నెలాఖరుకు కంప్యూటరీకరణ
Comments
Please login to add a commentAdd a comment